‘నీతి’ ఆరోగ్య సూచీలో కేరళ టాప్‌

10 Feb, 2018 02:07 IST|Sakshi
నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌

8, 11 స్థానాల్లో ఏపీ, తెలంగాణ.. చివరి స్థానంలో యూపీ

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ వెల్లడించిన ఆరోగ్య సూచీలో కేరళ మొదటి స్థానంలో నిలిచింది. వైద్యసదుపాయాలు, శిశు మరణాల రేటు, ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు, సంపూర్ణ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం అమలు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు వంటి వివిధ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. ‘ఆరోగ్యవంతమైన రాష్ట్రాలు, ప్రగతిశీల భారతం: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ర్యాంకుల రిపోర్టు’ పేరుతో నీతి ఆయోగ్‌–ప్రపంచబ్యాంకు సంయుక్తంగా రూపొందించిన ఈ జాబితాను శుక్రవారం విడుదల చేశారు.  గుజరాత్‌ నాలుగో స్థానంలో ఉంది.

గతంతో పోలిస్తే ఇటీవల వైద్యప్రమాణాలు మెరుగుపరుచుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్‌ అట్టడుగు స్థానంలో నిలిచింది. జాబితాలో దారుణమైన పనితీరును కనబరిచిన రాష్ట్రాలుగా రాజస్తాన్, బిహార్, ఒడిశా నిలిచాయి. ఏపీ 8వ స్థానంలో, తెలంగాణ 11వ స్థానంలో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే మెరుగైన వైద్యవసతులు కల్పిస్తున్న జాబితాలో జార్ఖండ్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తామని.. ఈ జాబితా విడుదల సందర్భంగా నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ పేర్కొన్నారు. జాబితాలో తొలిస్థానంలో నిలవటం.. ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ వెల్లడించారు.

తొలి మూడు          తుది మూడు
   కేరళ                   బిహార్‌
 పంజాబ్‌                రాజస్తాన్‌
  తమిళనాడు          ఉత్తరప్రదేశ్‌ 

మరిన్ని వార్తలు