కార్యకర్తలు భక్తులు కాకూడదా.. సుప్రీం అలా చెప్పలేదే!?

4 Jan, 2019 12:51 IST|Sakshi

తిరువనంతపురం : శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకోవడం వెనుక కేరళ సీఎం పినరయి విజయన్‌ తోడ్పాటు ఉందన్నవార్తలను కనకదుర్గ, బిందులు ఖండించారు. తమకు ఉన్న హక్కును ఉపయోగించుకున్నామే తప్ప ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ.. రుతుస్రావ వయసులో ఉన్న కేరళకు చెందిన కనకదుర్గ(44), బిందు అమ్మిని(42)లు బుధవారం అయ్యప్పను దర్శించుకున్న విషయం తెలిసిందే. దీంలో కేరళ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి విజయన్‌ సహకారంతోనే ఆ ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించి అపచారం చేశారంటూ సంఘ్‌ పరివార్‌, కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలను కనకదుర్గ, బిందులు ఖండించారు. తాము అయ్యప్ప దర్శనం చేసుకునే క్రమంలో భక్తులెవరూ అడ్డు చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తమ స్వార్థ రాజకీయాల కోసం కొన్ని పార్టీలు వివాదాస్పదం చేస్తున్నాయని విమర్శించారు.

భక్తులూ.. కార్యకర్తలు ఎవరైనా వెళ్లవచ్చు
ఆలయ ప్రవేశం గురించి కనకదుర్గ మాట్లాడుతూ... ‘ ఇది నా సొంత నిర్ణయం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపయోగించుకుని పోలీసుల సహాయంతో గుడిలో అడుగుపెట్టాము. ఈ విషయంలో సీఎం మాకు సహాయం చేశారో లేదోనన్న సంగతి మాకైతే తెలియదు. ఒకే భావజాలం ఉన్న మేమిద్దరం(బిందు, నేను) స్వామిని దర్శించుకోవాలనుకున్నాం. ఇందులో పోలీసులు, రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. కొందరు బీజేపీ కార్యకర్తలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. కాగా సామాజిక కార్యకర్తగా ఉన్న మీరు భక్తురాలా అని విలేరులు ప్రశ్నించగా... ‘ అవును నేను కార్యకర్తను. అలాగే భక్తురాలిని కూడా. నేనే కాదు మరికొంత మంది నాలాంటి కార్యకర్తలు దేవుడిని దర్శించుకోవచ్చు. భక్తులైనా, కార్యకర్తలైనా అన్ని వయస్సుల మహిళలు గుడిలోకి వెళ్లవచ్చని కదా సుప్రీం తీర్పునిచ్చింది’ అని సమాధానమిచ్చారు.(చదవండి : ఆ ఇద్దరు మహిళలు ఎవరు?)

ప్రస్తుతం ఏ పార్టీలో లేను
‘ప్రస్తుతం నేను ఏ పార్టీకి చెందినదాన్ని కాదు. గతంలో సీపీఐ(ఎంఎల్‌) కేంద్ర కమిటీలో భాగంగా ఉండేదాన్ని. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో రాజీనామా చేశారు. డిసెంబరు 24నే దర్శనం చేసుకుందామనుకున్నాం. కానీ ఆరోజు కుదరలేదు. ఒకవేళ ఇంటికి వెళ్తే మళ్లీ దేవుడిని దర్శనం చేసుకునే అవకాశం రాదని భావించాం. పంబా పోలీసులను రక్షణ కోరాం. కాలినడకన వెళ్లి.. అనుకున్నట్టుగానే అయ్యప్ప దర్శనం చేసుకున్నాం’ అని’ బిందు పేర్కొన్నారు. కాగా కేరళ యూనివర్శిటీ నుంచి మాస్టర్‌ లా పట్టాను సాధించిన బిందు అమ్మిని ప్రస్తుతం కన్నూరు యూనివర్శిటీలో న్యాయశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తుండగా... కేరళ పౌర సరఫరాల కార్పొరేషన్‌లో  కనకదుర్గ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక...‘నవోతన కేరళం శబరిమలాయిలెక్కు’ అనే ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా వీరిద్దరికి పరిచయం ఏర్పడింది.

మరిన్ని వార్తలు