పొంచిఉన్న అంటువ్యాధులు

20 Aug, 2018 02:42 IST|Sakshi
కొచ్చిలోని ఓ సహాయక శిబిరంలో తలదాచుకుంటున్న వరద బాధితులు

వరద ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆందోళన

వెంటనే అత్యవసర మందుల్ని పంపాలని కేంద్రానికి లేఖ

కలరా, డయేరియా, టైఫాయిడ్‌ ప్రబలే అవకాశముందని వెల్లడి

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదలకు అతలాకుతలం అవుతున్న కేరళకు మరో ముప్పు పొంచిఉందా? వరద తాకిడి క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అక్కడ అంటువ్యాధులు విజృంభించే అవకాశం ఉందా? అంటే వైద్య నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఉన్న మందులు నీళ్లలో కొట్టుకుపోయిన నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలితే నిలువరించడం చాలా కష్టమవుతుందని హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే కలరా, డయేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు ప్రబలి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. కేరళ ప్రజలు ఇప్పటికే చికున్‌గన్యా, డెంగ్యూ వాధులతో అల్లాడుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. కాగా తమ రాష్ట్రానికి అత్యవసర మందుల్ని అందించి ఆదుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, ప్రైవేటు ఆసుపత్రులకు కేరళ లేఖ రాసింది.

జ్వరం, డయేరియా మందులు పంపండి
కేరళలోని 481 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 137 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, 19 డిస్పెన్సరీల్లో మందులు నిండుకున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సదానందన్‌ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీలైనంత త్వరగా జ్వరం, దగ్గు, జలుబు, డయేరియా, హైపర్‌టెన్షన్‌ వంటి రోగాలకు అవసరమైన మందుల్ని అందించాలని కేంద్ర ఆరోగ్య శాఖ, ప్రైవేటు ఆసుపత్రులకు విజ్ఞప్తి చేశారు. కేరళ ప్రభుత్వ విజ్ఞప్తిపై కేంద్రం వెంటనే స్పందించింది. విజయన్‌ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేరళకు కావాల్సిన అన్నిరకాల మందుల్ని వైమానిక మార్గం ద్వారా పంపిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోజ్‌ ఝలానీ తెలిపారు. అలాగే ప్రజలకు సాయం అందించేందుకు వైద్య బృందాలు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు కేరళ ప్రభుత్వం పిలుపు మేరకు మెడిట్రినా ఆసుపత్రి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మెడికల్‌ క్యాంపులకు తమ వైద్యులను, మందులతో పంపుతున్నట్లు మెడిట్రినా గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ సీఈవో పీఎన్‌ మంజు తెలిపారు.

ప్రైవేటు ఆసుపత్రులకు క్యూ..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వరదల కారణంగా మందులు దెబ్బతినడంతో వైద్యులు రోగులకు ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. దీంతో చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. కొచ్చిలోని అమృత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఏఐఎంఎస్‌) ఔట్‌ పేషంట్‌ సేవల్ని నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ విషయమై అమృత ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ సంజీవ్‌ సింగ్‌ మాట్లాడుతూ..‘వైద్యులు, ఇతర సిబ్బంది ఆసుపత్రికి రాలేకపోతున్నారు. మా ఆసుపత్రి గ్రౌండ్‌ ఫ్లోర్‌ వరదనీటితో నిండిపోయింది. ఇప్పుడు ఆసుపత్రిలో 900 మంది రోగులు చికిత్స పొందుతుండగా, వీరిలో 150 మంది ఐసీయూలో ఉన్నారు.  ఆసుపత్రిలో విద్యుత్, మంచినీటి సరఫరాను కొనసాగించేందుకు మేమంతా పోరాడుతున్నాం. అదనంగా మరో 300 మందిని ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందజేస్తున్నాం. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు