జయ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలి: కేతిరెడ్డి

14 Dec, 2016 21:29 IST|Sakshi
జయ మృతిపై సీబీఐ దర్యాప్తు చేయాలి: కేతిరెడ్డి

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. తమిళనాడులోని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలుచేశారు. జయలలిత మృతిపై తమకు అనుమానాలున్నాయని, ఈ విషయంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. అనంతరం సీబీఐ దర్యాప్తునకు మద్దతు కోరుతూ అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుస్తానని చెప్పిన ఆయన నేడు(బుధవారం) సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కలిశారు. సీబీఐ దర్యాప్తునకు మద్దతివ్వాలని కోరుతూ ఓ వినతిపత్రం ఇచ్చారు. గురువారం న్యూఢిల్లీలో ఇతర రాజకీయ పక్షాలను కలిసి వారికీ వినతిపత్రం సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.

అంతకుముందు జయలలిత మరణంపై ఎన్నో అనుమానాలున్నాయని సీబీఐ దర్యాప్తు చేయాలని కేతిరెడ్డి కోరిన విషయం తెలిసిందే. గత సెప్టెంబర్‌ 22న జ్వరం, డీ హైడ్రెషన్‌ కారణంగా ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తర్వాత జబ్బు బారిన పడటం.. ఆపై ఆమె కోలుకున్నారని ప్రకటించారు. డిసెంబర్‌ 4న హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చిందని చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యంతోపాటు పలు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన ఆ సమయంలో మీడియాకు ప్రత్యేక లేఖ కూడా విడుదల చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు