గాంధీ టోపీ, ఖాదీ దారంపై జీఎస్టీ లేదు

5 Jun, 2017 00:48 IST|Sakshi
గాంధీ టోపీ, ఖాదీ దారంపై జీఎస్టీ లేదు

► జాతీయ పతాకానికీ మినహాయింపు
► రుద్రాక్షలు, పంచామృతంపైనా పన్ను లేదు
► సాంబ్రాణి, కలకండపై 5 శాతం పన్ను


న్యూఢిల్లీ: ఖాదీ దారం, గాంధీ టోపీ, భారత జాతీయ పతాకానికి వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నుంచి మినహాయింపు లభించనుంది. అనుకరణ అభరణాలు(ఇమిటేషన్‌ జ్యుయెలరీ), ముత్యాలు, బంగారు నాణేలపై మాత్రం 3 శాతం పన్ను ఉంటుంది. శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో పన్ను విధింపుపై తీసుకున్న నిర్ణయాలకు సంబం ధించి మరిన్ని వివరాలు ఆదివారం వెల్లడయ్యాయి. విభూతి, రుద్రాక్షలు వంటి పూజా సామగ్రికి పన్ను నుంచి మినహాయింపు దక్కింది.

బ్లాంకెట్లు, ప్రయాణపు దుప్పట్లు, కర్టెన్లు, పరుపు కవర్లకు వాడే లినెన్, టాయిలెట్, వంటగదుల్లో వాడే లినెన్, నాప్కిన్లు, దోమతెరలు, సంచులు, బ్యాగులు, లైఫ్‌ జాకెట్ల ధర రూ. వెయ్యి లోపు ఉంటే 5 శాతం పన్ను. రూ. వెయ్యి దాటితే 12 శాతం పన్ను.
సిల్క్, జనపనార దారాలకు పన్ను నుంచి మినహాయింపు.  ఇతర దారాలపై 5 శాతం. చేత్తో చేసిన నారపై 18 శాతం.
♦  చేతితో చేసిన దుస్తుల ధర రూ. వెయ్యి లోపు ఉంటే 5 శాతం, వెయ్యి దాటితే 12 శాతం.
అగ్గిపెట్టెలు, ప్యాక్‌ చేసిన సేంద్రియ ఎరువులపై 5 శాతం.

ఐజీఎస్టీ నుంచి మినహాయింపు
రాష్ట్రాల మధ్య రవాణా అయ్యే వస్తు, సేవలపై కేంద్రం విధించే సమీకృత జీఎస్టీ(ఐజీఎస్టీ) నుంచి మినహాయిపు ఉన్న వివరా లను పన్ను శాఖ తన వెబ్‌సైట్లో వెల్లడించింది. ధార్మిక సంస్థలు పేదలకు పంచడానికి విదేశాల నుంచి అందుకునే ఆహారం, ఔషధాలు, వస్త్రాలు, దుప్పట్లపై పన్ను ఉండదు.

బాధితుల కోసం రెడ్‌ క్రాస్‌ సొసైటీ దిగుమతి చేసుకునే మందులు, భోపాల్‌ లీక్‌ గ్యాస్‌ బాధితుల చికిత్సకు అవసరమయ్యే వైద్య పరికరాలపై పన్ను వేయరు. ప్రజానిధులతో నడిచే పరిశోధన సంస్థలు, వర్సిటీలు, ఐఐటీలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లేబొరేటరీలు, ప్రాంతీయ కేన్సర్‌ సెంటర్లు తదితర సంస్థలు వాడే పరిశోధన పరికరాలపైనా పన్ను ఉండదు.

జీఎస్టీపై ప్రచారం ప్రారంభం
సామాన్యులకు జీఎస్టీపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రచారం ప్రారంభించింది. జీఎస్టీ అమల్లోకి వస్తే చాలా వస్తువుల ధరలు తగ్గుతాయంటూ కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్‌ బోర్డు(సీబీఈసీ) ప్రముఖ దినపత్రికల్లో సచిత్ర ప్రకటనలు జారీ చేసింది. పన్ను నుంచి మినహాయిపు ఉన్న వాటి వివరాలను, 5 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల వివరాలను వెల్లడించింది.

పూజా సామగ్రిపై పన్ను లేదు
మతసంస్థలు ‘పూజాసామగ్రి’ పేరుతో అమ్మే రుద్రాక్షలు, చెక్క పాదరక్షలు, పంచా మృతం, తులసి పూసల మాల, దారాలు, విభూతి, చందనం, అన్‌బ్రాండెడ్‌ తేనె, దీపపు వత్తులపై పన్ను ఉండదు.

వీటిపై 5 శాతం పన్ను
సాంబ్రాణి, కలకండ, చక్కెర బూందీ(బటాషా), చక్కెర పొడి

మరిన్ని వార్తలు