ఖార్ రైల్వే స్టేషన్ @ 90

2 Jul, 2014 00:10 IST|Sakshi

 ముంబై: నగర ప్రజలకు విశేష సేవలందిస్తున్న ఖార్ రైల్వేస్టేషన్ ఏర్పాటుచేసి ఇప్పటికి 90 ఏళ్లు నిండాయి. బాంద్రా పట్టణానికి అనుబంధంగా ఏర్పడిన ఈ స్టేషన్‌ను 1924 జూలై ఒకటో తేదీన ప్రారంభించారు. నగరాభివృద్ధికి అనుగుణంగా అంచెలంచెలుగా వృద్ధి చెందుతూ వస్తున్న ఈ స్టేషన్‌ను ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 85 వేలమంది ఆశ్రయిస్తున్నారు. ఉత్తర బాంద్రాలో ముంబై అభివృద్ధి శాఖ చేపట్టిన పలు పథకాల అమలుకు అవసరమైన సేవలందించేందుకు ఈ స్టేషన్‌ను మొదట ఏర్పాటుచేశారని పశ్చిమ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

ఖార్‌లో నగరావసరాలకు గాను గృహ నిర్మాణ పథకం కింద పదివేల జనాభాకు సరిపడా 842 ఫ్లాట్లను నిర్మించారు. అంతేకాక ప్రఖ్యాత పాలి హిల్ ప్రాంత వాసులకు కూడా ఈ ఖార్ స్టేషన్ అనుకూలంగా మారింది. మొదట్లో ఈ స్టేషన్‌ను రోజూ సుమారు 1,700 మంది వినియోగించుకుంటారని పశ్చిమ రైల్వేఅధికారులు అంచనా వేశారు.అయితే తర్వాత కాలంలో నగరీకరణ నేపథ్యంలో ఈ స్టేషన్ మంచి సెంటర్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజూ 85 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజూ 648 పశ్చిమ రైల్వే రైళ్లు, 108 హార్బర్ లైన్ రైళ్లు నిలుస్తున్నాయి.

ఈ స్టేషన్‌కు ఉత్తరాన శాంతాకృజ్, దక్షిణాన బాంద్రా ఉన్నాయి. 1960 నాటికే ఈ స్టేషన్ సమీపంలో పలు కార్పొరేట్‌సంస్థలు, బహుళ అంతస్తుల  భవనాలు, ప్రముఖ పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఖార్ ప్రాంతం పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఇతర సెలబ్రిటీలకు నివాసప్రాంతంగా మారింది.

>
మరిన్ని వార్తలు