కమలం గూటికి ఖుష్బు?

18 Jun, 2014 00:10 IST|Sakshi
కమలం గూటికి ఖుష్బు?

సాక్షి, చెన్నై:నటి ఖుష్బు డీఎంకేను వీడిన విష యం తెలిసిందే. పార్టీకి రాజీనామా చేస్తూ అధినేత కరుణానిధికి లేఖాస్త్రాన్ని ఆమె సంధించారు. అయితే, తదుపరి తన అడుగులు ఎటో అన్నది ఆమె ప్రశ్నార్థకంగా ఉంచినా, కమలం తీర్థం పుచ్చుకోవడం ఖాయం అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎంకేను వీడాలన్న నిర్ణయాన్ని ఖుష్బు హఠాత్తుగా తీసుకున్నది మాత్రం కాదన్నట్టు కోలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఎప్పుడో డీఎంకేను వీడాల్సిన ఆమె, ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నారంటూ చెబుతున్నారు.ఎన్నికలప్పుడే మంతనాలు : తనను డీఎంకేలో పక్కన పెడుతూ రావడంపై ఖుష్బు తీవ్ర మనోవేదనకు లోనైనట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో తనకు సీటు వస్తుందన్న ఆశతో ఆమె ఉన్నట్టు, చివరకు డీఎంకే అధిష్టానం మొండి చేయి చూపించడాన్ని జీర్ణించుకోలేక పోయార న్నట్టుగా చర్చ సాగుతోంది.
 
 ఈ విషయమై మీడియా కదిలించినప్పుడు అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నానంటూ వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. ఇదే సమయంలో ఢిల్లీలో, బాలీవుడ్‌లో తనకు ఉన్న పరిచాయాల మేరకు బీజేపీ గూటికి చేరడానికి చాప కింద నీరులా ఖుష్బు ప్రయత్నాలు చేసినట్టు సమాచారం వెలుగు చూసింది. ఈ విషయం డీఎంకే అధినేత ఎం కరుణానిధి దృష్టికి చేరడంతో ఆయన బుజ్జగించినట్టు, ఆయన సూచనకు తలొగ్గిన ఖుష్బు ఆలస్యంగా ప్రచారానికి రెడీ అయ్యారన్న చర్చ డీఎంకేలో సాగుతోంది. పార్టీ కోసం తాను శ్రమిస్తున్నా, తనకు సరైన గుర్తింపు ఇవ్వడంలో అధిష్టానం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడం, తనను కేవలం ప్రచార వస్తువుగా మాత్రమే డీఎంకే వాడుకుంటోందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అధినేత కరుణానిధికి లేఖాస్త్రం సంధించినట్టున్నారు.
 
 కమలం గూటికి: ఎన్నికలప్పుడే బీజేపీలో చేరడానికి ఖుష్బు మార్గం సుగమం చేసుకున్నట్టు సంకేతాలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోడీ సమక్షంలో కోయంబత్తూరు వేదికగా పార్టీలో చేరే సమయంలో అధినేత కరుణానిధి అడ్డు పడినట్లు సమాచారం. చివరి క్షణంలో తన ప్రయత్నాన్ని వీడిన ఖుష్బు తాజాగా మళ్లీ కమలం గూటికి చేరే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం మొదలైంది. నటి, కేంద్ర మంత్రి సృతి ఇరానీకి మద్దతుగా ఇది వరకు ఖుష్బు పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసి ఉన్నారు. దీని వెనుక బీజేపీలో చేరనున్న సంకేతం ఉన్నట్టు కమలాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఖుష్బుకు పరిచయం ఉన్నట్టు, అందుకే ఆమెకు అభినందనలు సైతం ఖుష్బు  ప్రకటించి ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
 
 ఎన్నికలప్పుడే ఆమె తమ గూటికి చేరి ఉంటే, ఏదో ఒక చోట అభ్యర్థిగా నిలబడి పార్లమెంట్ మెట్లు ఎక్కి ఉండే వార ని చెబుతున్నారు. ఇప్పటికైనా ఆమె తమ పార్టీలోకి వస్తే ఆహ్వానించేందుకు సిద్ధం అని బీజేపీ నేత ఒకరు పేర్కొనడం గమనార్హం. అదే సమయంలో, రాష్ట్ర బీజేపీలో ప్రత్యేక ఆకర్షణగా ఇద్దరు మహిళా నాయకులు మాత్రమే ఉన్నారు. అయితే, సినీ గ్లామర్ బీజేపీలో లేదు. ఖుష్బు చేరిన పక్షంలో రాష్ట్ర బీజేపీకి మరింత ఆకర్షణ రావడం ఖాయం. ఢిల్లీలో ఉన్న పరిచయాల మేరకు ఆమె తమ పార్టీలోకి తప్పకుండా వచ్చే అవకాశాలు ఉన్నాయని మరో నేత పేర్కొనడం బట్టి చూస్తే, త్వరలో కమలం గూట్లో చేరే అధికారిక ప్రకటనను ఖుష్బు చేసేనా? అన్నది వేచి చూడాల్సిందే!
 

>
మరిన్ని వార్తలు