వాళ్లందరినీ దేశం నుంచి తరిమేయండి

12 Apr, 2017 18:00 IST|Sakshi
వాళ్లందరినీ దేశం నుంచి తరిమేయండి

కుల్‌భూషణ్‌ జాదవ్‌కు పాకిస్తాన్ ఉరిశిక్ష విధించడంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన తీవ్రంగా మండిపడింది. జాదవ్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టేవరకు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పాక్ జాతీయుడిని దేశం నుంచి తరిమికొట్టాలని డిమాండ్ చేసింది. ''పాకిస్తానీలు అందరినీ చితక్కొట్టి దేశం నుంచి తరిమేయండి. వాళ్లు ఎవరైనా సరే. కొట్టి కొట్టి తరమాలి'' అని ఎంఎన్ఎస్ చెప్పింది. కుల్‌భూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ విడిచిపెట్టేవరకు ఇది కొనసాగాలని, ఈ విషయంలో తమ నిర్ణయం చాలా పక్కాగా ఉందని ఎంఎన్ఎస్ సీనియర్ నాయకుడు సందీప్ దేశ్‌పాండే అన్నారు.

కుల్‌భూషణ్ జాదవ్‌కు, అతడి కుటుంబానికి తాము అండగా ఉంటామని, అతడు విడుదలయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. భారతదేశంలో ఉన్నవాళ్లు పాకిస్తానీ పౌరులైనా, వ్యాపారవేత్తలైనా, కళాకారులైనా.. ప్రతి ఒక్కరినీ తరిమి తరిమి కొట్టాలన్నారు. గతంలో కూడా బాలీవుడ్‌ సినిమాలలో పాకిస్తానీ కళాకారులు పనిచేయడాన్ని ఎంఎన్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. కరణ్ జోహార్ తీసిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో పాకిస్తానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించడంతో ఆ సినిమాను ఎంఎన్ఎస్ తొలుత నిషేధించింది కూడా. ఆ తర్వత చర్చల ఫలితంగా నిషేధాన్ని ఎత్తేశారు.

మరిన్ని వార్తలు