చిన్నారులపై నేరాల్లో యూపీ టాప్‌

19 Mar, 2018 01:50 IST|Sakshi

వృద్ధులపై నేరాల్లో 4, 5 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నివేదిక విడుదల చేసిన ఎన్‌సీఆర్‌బీ  

కోల్‌కతా: దేశవ్యాప్తంగా 2015 నుంచి 2016 వరకు చిన్నారులపై నేరాలు 11 శాతం పెరిగాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో(ఎన్‌సీఆర్‌బీ) నివేదిక విడుదల చేసింది. 2015లో దేశవ్యాప్తంగా 94,172 నేరాలు నమోదుకాగా 2016 నాటికి ఈ సంఖ్య 1,06,958కు చేరుకుందని పేర్కొంది. ఈ నివేదికను విశ్లేషించిన క్రై అనే ఎన్జీవో సంస్థ డైరెక్టర్‌ కోమల్‌ గనోత్రా మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చిన్నారులపై జరిగిన నేరాల్లో 50 శాతం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లోనే నమోదయ్యాయని వెల్లడించారు.

ఈ నేరాల్లో 15 శాతంతో యూపీ మొదటిస్థానంలో ఉండగా, మహారాష్ట్ర(14 శాతం), మధ్యప్రదేశ్‌(13 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయని తెలిపారు. నేరాల్లో మాయమాటలు చెప్పి తీసుకెళ్లడం, కిడ్నాపింగ్‌లు(48.9 శాతం) తొలిస్థానంలో ఉండగా.. పిల్లలపై అత్యాచారాలు(18 శాతం) తర్వాతిస్థానంలో నిలిచినట్లు వెల్లడించారు. మరోవైపు 2014–16 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడ్డ వృద్ధుల(సీనియర్‌ సిటిజన్స్‌)పై జరిగిన నేరాల్లో 40 శాతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయని తెలిపారు.

వృద్ధులను దోచుకోవడం, దాడిచేయడం, మోసం చేయడం వంటి నేరాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలు తర్వాతి స్థానాల్లో నిలిచాయని వెల్లడించారు.  చిన్నారుల కిడ్నాపుల్లో యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయని పేర్కొన్నారు.  దేశవ్యాప్తంగా 1,11,569 మంది పిల్లలు(41,175 మంది బాలురు, 70,394 మంది బాలికలు) తప్పిపోయారన్నారు.  పోలీసులు, అధికారుల చొరవతో 2016 చివరినాటికి 55,944 మంది చిన్నారుల్ని కాపాడగలిగామన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు