కౌంట్‌డౌన్‌ మొదలైంది!

1 Jun, 2020 08:31 IST|Sakshi

గవర్నర్‌గా ఐదో వసంతంలోకి కిరణ్‌

పుదుచ్చేరి వాసులకు గవర్నర్‌ లేఖ 

సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కిరణ్‌బేడి నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో వసంతంలోకి అడుగు పెట్టారు. ఈసందర్భంగా తన సేవలను గుర్తు చేస్తూ పుదుచ్చేరి ప్రజలకు ఆమె ఓ లేఖ రాయడమే కాదు,  చివరగా కౌంట్‌డౌన్‌ మొదలైందంటూ ముగించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి 2016లో మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌బేడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ఆమె బాధ్యతలు స్వీకరించడం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మధ్య నాలుగేళ్లుగా అధికార వార్‌ కొనసాగుతూనే వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆదివారం తాను లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు ముగించి, ఐదో వసంతంలోకి అడుగు పెట్టడంతో ప్రజలకు కిరణ్‌ ఓ లేఖాస్త్రం సంధించారు. అందులో తాను బాధ్యతలు స్వీకరించడం, ప్రజాహితాన్ని కాంక్షిస్తూ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. రాజ్‌ నివాస్‌ సేవల్ని, ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేశారు. ప్రజాహిత కార్యక్రమాల్ని ఎన్నడూ రాజ్‌ నివాస్‌ అడ్డుకోలేదని వివరించారు. రాజ్‌ నివాసన్‌ ప్రజల నివాస్‌గా మారిందన్నారు. వారంలో ఓ రోజు ప్రజలతో మమేకం అయ్యే రీతిలో కార్యక్రమాలు సాగిందని గుర్తు చేస్తూ, ఇప్పుడు కరోనా అందుకు అడ్డు వచ్చినట్టు పేర్కొన్నారు. మున్ముందు ఈ కార్యక్రమాలు కొనసాగేనా అన్నది కాలమే నిర్ణయిస్తుందన్నారు.  

ఆర్థిక పరిస్థితి మెరుగు లక్ష్యంగా.. 
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు లక్ష్యంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ పరమైన సిద్ధాంతాల్ని పునఃపరిశీలించాల్సి ఉందని వివరించారు. మద్యం దుకాణాల వేలం, ఆస్తి, వినోద పన్నుల బకాయిల వసూళ్లు, కొన్నేళ్లుగా చెల్లించకుండా ఉన్న ప్రభుత్వ స్థలాల లీజుకు సంబంధించిన అద్దెల వసూళ్లు అంశాలపై పునఃపరిశీలన తప్పనిసరిగా పేర్కొన్నారు. కరోనా రూపంలో పర్యాటక ఆదాయం పూర్తిగా కోల్పోవడం జరిగిందని పేర్కొంటూ, ప్రస్తుతం చేతిలో ఉన్న ఆస్తుల ఆధారంగా ఆదాయం పెంచుకోవాల్సిన ఉందన్నారు. విజయన్‌ కమిటీ నివేదికను అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం నియమించ బడ్డ లేదా ఎంపిక చేసిన అధికారులు నిబద్ధత, నిజాయితీతో పనిచేసి ప్రజల జీవన ప్రమాణాల మెరుగు, ఆర్థిక పరిస్థితుల మెరుగు దిశగా ముందుకు సాగాలని సూచించారు. ఇలా అన్ని విషయాల గురించి ప్రస్తావిస్తూ, చివరగా పుదుచ్చేరికి సేవ చేయడానికి వచ్చి నాలుగేళ్లు పూర్తి అయిందని, ఐదో ఏట అడుగు పెట్టానని, ఇక, తన కౌంట్‌డౌన్‌ మొదలైందని ముగించారు. ఈ దృష్ట్యా, మళ్లీ అవకాశం ఇచ్చినా, ఆ పదవిలో కిరణ్‌ కొనసాగేది అనుమానమేనా అన్న చర్చ బయలు దేరింది.   

మరిన్ని వార్తలు