కిరణ్ బేడీకి రెండు ఓటరు కార్డులు

29 Jan, 2015 02:52 IST|Sakshi
కిరణ్ బేడీకి రెండు ఓటరు కార్డులు

 ఈసీ విచారణ ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీకి వేర్వేరు చిరునామాలతో రెండు ఓటరు ఐడీ కార్డులున్న విషయం వెలుగుచూసింది. ఎన్నికల కమిషన్(ఈసీ) రికార్డుల ప్రకారం ఉదయ్‌పార్క్, తల్కతోరా లేన్ చిరునామాలతో ఆమెకు రెండు ఓటరు కార్డులు(టీజెడ్‌డీ1656909, ఎస్‌జెఈ0047969) ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇవి ఎలా జారీ అయ్యాయో తేల్చేందుకు విచారణ ప్రారంభించామని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఈసీ తెలిపింది. మొదటి కార్డు(తల్కతోరా)ను తొలగించాలని ఆమె దరఖాస్తు చేశారో లేదో తెలుసుకుంటామంది. నామినేషన్ పత్రాల్లో ఆమె ఉదయ్‌పార్క్ చిరునామాలో ఉంటున్నట్లు పేర్కొన్నారు.
 
 ఈ ఉదంతంపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేయగా మరోపక్క.. తన ప్రత్యర్థి కేజ్రీవాల్ ప్రతికూల వ్యక్తి అని, ఆయన బృందం అత్యంత విషపూరితమైందని బేడీ విమర్శించారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనుండడంతో బీజేపీ తన ముఖ్య నాయకుల్లో కొందరిని బుధవారం ఎన్నికల ప్రచారంలోకి దింపింది. కేంద్ర మంత్రులు సుష్మా, స్మృతి ఇరానీలు ఢిల్లీలో పలు చోట్ల ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ నాలుగు సభలో పాల్గొననున్నారు. కాగా, ప్రత్యర్థి పార్టీ సీనియర్ నేత ఒకరు తమ పార్టీకి చెందిన కొంతమంది అభ్యర్థులపై మీడియాలో దుష్ర్పచారం చేయడానికి కుట్రపన్నారని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు.

మరిన్ని వార్తలు