సూర్యుడి నుంచి ఓంకారం; నెటిజన్ల ఆగ్రహం

4 Jan, 2020 16:10 IST|Sakshi

కిరణ్‌ బేడీ ఫార్వార్డ్‌ మెసేజ్‌.. తప్పని ట్రోలింగ్‌

పుదుచ్చేరి : సోషల్‌ మీడియా విసృతి పెరగడంతో వాస్తవాల కంటే అసత్య వార్తలే ఎక్కువగా ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్‌లో చాలామంది తమకు వచ్చిన మెజేజ్‌లలో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం చేయకుండానే మరొకరికి ఫార్వార్డ్‌ చేస్తున్నారు. దాంతో మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతోంది. సచిన్‌ టెండూల్కర్‌, ఆనంద్‌ మహింద్ర వంటి వారు స్ఫూర్తిమంతమైన వార్తల్ని ప్రచారం చేస్తుండగా.. కొందరు ప్రముఖులు మాత్రం అనాలోచితంగా మెసేజ్‌లు ఫార్వార్డ్‌ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌బేడీ తాజాగా ఆ జాబితాలో చేరారు. ఎన్నో నెలలుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఓ అసత్య వార్తను ఆమె ట్విటర్‌లో పోస్టు చేసి ట్రోలింగ్‌​ బారిన పడ్డారు.

ఆమె ఓ వీడియోను పోస్టు చేసి.. ‘సూర్యుడి నుంచి వస్తున్న ఓంకార శబ్దాన్ని నాసా రికార్డు చేసింది’ అని క్యాప్షన్‌ కూడా ఇచ్చారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోలింగ్‌ చేయడం మొదలు పెట్టారు. నాసా గతంలో విడుదల చేసిన అసలు వీడియోను పోస్టు చేసి.. వాస్తవాలు తెలుసుకోండి మేడం..! అని కామెంట్లు చేస్తున్నారు. ఒక కేంద్రపాలిత ప్రాంతానికి అత్యున్నత అధికారిగా ఉన్న వ్యక్తి ఇలాంటి నమ్మకాలను, అసత్యాలను ప్రచారం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ట్వీట్‌ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోండి అని ఎద్దేవా చేస్తున్నారు. కాగా, 40 రోజులపాటు సూర్యుడు, హీలియోస్ఫెరిక్‌ అబ్జర్వేటరీ (ఎస్‌వోహెచ్‌వో)కి చెందిన డేటాను మిచెల్సన్‌​ డాప్లర్‌ ఇమేజర్‌ సాయంతో ఎ.కొసొవికెవ్‌ అనే శాస్త్రవేత్త ప్రాసెస్‌ చేశారు. ఈ వీడియోను 2018లో నాసా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది.

మరిన్ని వార్తలు