మే 3కల్లా కరోనా కేసులు తగ్గే అవకాశం..

17 Apr, 2020 14:54 IST|Sakshi

లాక్‌డౌన్‌ సమయంలో పెళ్లా?: కిషన్‌ రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు సంఖ్య వచ్చే నెల 3వ తేదీకల్లా తగ్గే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ  మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా కరోనా కేసులు కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని, నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ కార్యక్రమం వల్లే 58శాతం కేసులు వచ్చాయన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన కూలీలు ఎ‍క్కడివారు అక్కడే ఉండాలన్నారు. కూలీలకు ఆహారం, దుస్తుల కోసం కేంద్రం తగిన నిధులు పంపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.500 కోట్లు, తెలంగాణకు రూ.280 కోట్లు పంపించినట్లు కిషన్‌ రెడ్డి వెల్లడించారు. (లాక్డౌన్ వేళ దేవుడి రథోత్సవం!)

అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమారస్వామి పెళ్లిలో లాక్‌డౌన్‌ నిబంధనలను తుంగలో తొక్కిన విషయం తెలిసిందే. వివాహ తంతుపై  కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి స్పందిస్తూ...ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రధాని దేవెగౌడ , మాజీ సీఎం కుమారస్వామి  లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఈ విపత్కర సమయంలో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటే మంచిదన్నారు. కరోనాపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 20మందిని మించి గుమికూడదన్న విషయాన్ని గుర్తు చేశారు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన వారే నిబంధనలు ఉల్లంఘించడం దురదృష్టకరమన్నారు. (ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా! )

తన తల్లి సంవత్సరికం కార్యక్రమాన్ని కూడా ఆన్‌లైన్‌ ద్వారా తాను ఒక్కడినే నిర్వహించుకున్నానని, లాక్‌డౌన్‌ నిబంధలు ప్రజా ప్రతినిధులే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ శరణ్యమని ప్రపంచమంతా చెబుతోందన్నారు. అయితే రాహుల్‌ గాంధీ మాత్రం విచిత్రంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. టెస్టుల ద్వారా కరోనా తగ్గుతుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాహుల్‌ని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు చైర్మన్‌గా చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. (లాక్డౌన్ ఉల్లంఘించి.. ఎమ్మెల్యే బర్త్డే పార్టీ)

ఇక రైతులు పండించిన కూరగాయలు, పండ్లు ఢిల్లీకి రవాణా చేసేందుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు కిషన్‌ రెడ్డి చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని, పండ్లు, కూరగాయల రవాణలో సమస్యలు ఉంటే సహాయం కోసం  కాల్‌ సెంటర్‌ నెంబర్‌: 18001804200 & 14488 కు ఫోన్‌ చేయాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. (4 నిమిషాల్లో మూడుముళ్లు)

మరిన్ని వార్తలు