ట్రాఫిక్‌ చలానాలు; పస్తులతో ఆత్మహత్యలు!

11 Sep, 2019 20:39 IST|Sakshi

ముంబై : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటారు వాహన సవరణ చట్టం-2019పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక జరిమానాలను విధించే ఈ చట్టం సామాన్యుడి నడ్డి విరిచేలా ఉందంటూ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కొత్త ట్రాఫిక్‌ జరిమానాలు సగానికి తగ్గిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. బీజేపీ పాలిత రాష్ట్రంలోనే కొత్త చట్టంపై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తాము మాత్రం ఎందుకు దీనిని అమలు చేయాలని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో జరిమానాలు తగ్గించడంపై రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రైతు సంఘం ప్యానెల్‌ చీఫ్‌ కిశోర్‌ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టం పౌరులను ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ చట్టం కారణంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు.

బుధవారం ఓ కార్యక్రమంలో కిశోర్‌ తివారీ మాట్లాడుతూ...‘ ప్రధాని, హోం మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ట్రాఫిక్‌ చలానాలు తగ్గించారు. దీనిని బట్టి కొత్త చట్టానికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని అర్థమవుతోంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ చట్టంపై రెండో అభిప్రాయం ఉందని భావించవచ్చు. 10 వేల నుంచి 20 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. అద్దెకు వాహనాలు నడుపుకొని జీవనం సాగించే నెల జీతానికి సమానంగా జరిమానాలు ఉండటం దారుణం. అటువంటి బడుగు జీవులకు ఒక్కసారి జరిమానా పడిందంటే వాళ్ల కుటుంబం మొత్తం పస్తులతో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా వసంతరావు నాయక్‌ శెట్టి స్వాలంబన్‌ మిషన్‌ చైర్మన్‌గా ఉన్న కిశోర్‌ తివారీ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్‌ మంత్రి హోదా అనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా మహారాష్ట్ర రవాణా శాఖా మంత్రి దివాకర్‌ రౌత్‌ కూడా కొత్త మోటారు వాహన సవరణ చట్టాన్ని విమర్శించారు. ఈ మేరకు...‘ కొత్త చట్టం సామాన్యుల పాలిట భారంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరోసారి సమీక్షించి.. సవరించాల్సిన అవసరం ఉంది అని నితిన్‌ గడ్కరీకి లేఖ రాశారు. కాగా దివాకర్‌ శివసేన పార్టీకి చెందిన వారన్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవినిచ్చింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు