పక్షులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొచ్చి వాసులు

15 Jul, 2019 11:56 IST|Sakshi

తిరువనంతపురం : ప్రపంచవ్యాప్తంగా అడవుల పరిరక్షణ గురించి చర్చిస్తుంటే కొచ్చి జనాలు మాత్రం చెట్లు నరికేయండి బాబు.. పక్షులతో వేగ లేకపోతున్నాం అని వేడుకుంటున్నారు. ఎందుకో మీరు చదవండి. కొచ్చిలోని అలువా రైల్వే స్టేషన్‌లో సాధరణంగా వినిపించే ఫిర్యాదు చెట్లను నరికేయండి అని. ఎందుకంటే.. ఉద్యోగమో, మరేదో కారణాల రీత్యా ఇతర ప్రదేశాలకు వెళ్లేవారు రైల్వే స్టేషన్‌ పార్కింగ్ ప్లేస్‌లో తమ వాహనాలను పార్క్‌ చేసి వెళ్తున్నారు. తిరిగి వచ్చి చూసే సరికి వాహనాల నిండా పక్షి రెట్టలుండటంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్‌ పార్కింగ్‌ ప్రదేశంలో చెట్లు ఎక్కువగా ఉన్నాయి. దాంతో అవి కాస్త పక్షులకు నివాసంగా మారాయి. ఫలితంగా అక్కడ వాహనాలు నిలిపి వెళ్తున్న వాహనదారులు ఇలా పక్షి రెట్టలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రతి రోజు ఉదయం 20-30 నిమిషాల సమయాన్ని వాహనాలను శుభ్రం చేయడానికే కేటాయించాల్సి వస్తోందని వాపోతున్నారు. చెట్లను కొట్టేసి తమను ఈ సమస్య నుంచి బయటపడేయాల్సిందిగా రైల్వే అధికారులను వేడుకుంటున్నప్పటికి.. ఫలితం లేదని వాపోతున్నారు. దీనిపై రైల్వే అధికారులు స్పందిస్తూ.. ‘చెట్లను కొట్టేయడం అంత సులభం కాదు. అందుకు అనుమతులు రావడం కష్టమే కాక చెట్లను నరికితే.. పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బ తింటుంది’ అని తెలిపారు.

>
మరిన్ని వార్తలు