పాకిస్తాన్‌తో సంబంధాలా? కోర్టుకీడుస్తా..!

5 Jan, 2020 08:41 IST|Sakshi

కమిషనర్‌ విశ్వనాథన్‌పై కేసు వేస్తా! 

‘కోలం’ గాయత్రి ఫైర్‌ 

సాక్షి, చెన్నై: పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించిన పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌పై కోర్టులో కేసు వేస్తానని కోలం గాయత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ చెన్నై బీసెంట్‌నగర్‌ ప్రాంతంలో సీఏఏ వద్దంటూ కోలం (ముగ్గు) వేసిన సామాజికవేత్త, న్యాయవాది గాయత్రిపై పోలీసులు ఎనిమిది సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నగర పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ వద్ద విలేకరులు మాట్లాడగా గాయత్రి ఫేస్‌బుక్‌ తనిఖీ చేయగా ఆమెకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని, దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. దీనిపై గాయత్రి  ప్రతిస్పందిస్తూ సీఏఏకు వ్యతిరేకంగా తాను ముగ్గు వేసినందున కేసు నమోదు కాలేదని, ముగ్గు వేస్తున్న సమయంలో 92 ఏళ్ల వృద్ధునితో తగాదాకు దిగినందుకు కేసు నమోదు చేసినట్లు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ తెలిపినట్లు వెల్లడించారు. (ముగ్గుల వెనుక పాక్‌ హస్తం!)

అటువంటి వివాదం ఏదీ జరగలేదని, దీనిపై ఒక వీడియో విడుదల చేశారని, అందులో తగాదాకు దిగినట్లు ఆడియో మాత్రమే ఉందన్నారు. వృద్ధుని వద్ద ఫిర్యాదు తీసుకుని తమపై కేసు నమోదు చేయలేదన్నారు. శాంత భద్రతలకు భంగం వాటిల్లుతున్నట్లు, ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా నడుచుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తమపై వ్యక్తిగత కక్షతో కేసు నమోదు చేసినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. (ముగ్గులతో నిరసనలు.. పోలీసుల అదుపులో ఐదుగురు)


చట్టపరమైన చర్యలు 
తనకు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ పేర్కొన్నారని, పాకిస్తాన్‌ సహా తొమ్మిది దేశాలలో జరిపిన పరిశీలన గురించిన రిపోర్ట్‌ను ఫేస్‌బుక్‌లో విడుదల చేసినట్లు తెలిపారు. పోలీసు కమిషనర్‌ ఆరోపణలు వాస్తవ విరుద్ధమన్నారు. తనపై దుష్ప్రచారం సాగించేందుకు పోలీసు కమిషనర్‌ విశ్వనాథన్‌ అలా తెలిపారని, ఆయన తన అభిప్రాయాన్ని ఉపసంహరించుకుని క్షమాపణ కోరాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.

మరిన్ని వార్తలు