తొలి కస్టమర్‌కు బంగారు కత్తెరతో హెయిర్‌ కట్‌

30 Jun, 2020 16:03 IST|Sakshi

సెలూన్ల రీస్టార్ట్‌తో జోష్‌

ముంబై : కరోనా కట్టడికి విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం సెలూన్లు, బ్యూటీపార్లర్‌లకు అనుమతించడంతో కొల్హాపూర్‌కు చెందిన ఓ సెలూన్‌ ఓనర్‌ తన తొలి కస్టమర్‌కు బంగారు కత్తెరలతో హెయిర్‌ కట్‌ చేశారు. మూడు నెలల లాక్‌డౌన్‌ అనంతరం మహారాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ బిగెన్‌ అగైన్‌ పేరిట సెలూన్లు, బార్బర్‌ షాపులు, బ్యూటీ పార్లర్‌లను ఈనెల 28 నుంచి అనుమతించింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఇన్ఫెక్షన్‌ సోకే అవకాశం లేకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. బార్బర్‌ షాపులు తిరిగి తెరిచేందుకు అనుమతి లభించడంతో కొల్హాపూర్‌కు చెందిన బార్బర్‌ షాపు యజమాని రాంభూ సంకల్ప్‌ ఖుషీ అయ్యారు. లాక్‌డౌన్‌ అనంతరం ఆదివారం తన సెలూన్‌కు వచ్చిన తొలి కస్టమర్‌కు సంకల్స్‌ బంగారు కత్తెరలతో హెయిర్‌ కట్‌ చేశారు.

లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలకు పైగా రాష్ట్రంలో సెలూన్‌ బిజినెస్‌ మూతపడటంతో సెలూన్‌ నిర్వాహకులు, సిబ్బంది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారని, ఇబ్బందులను అధిగమించలేని కొందరు బార్బర్‌ షాపు యజమానులు తనువు చాలించిన ఘటనలూ చోటుచేసుకున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. సెలూన్లకు అనుమతించడంతో తమ వ్యాపారం తిరిగి గాడినపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంతోషాన్ని తాను వినూత్నంగా వ్యక్తం చేయాలనుకున్నానని చెప్పారు. ఇప్పటివరకూ తాను దాచుకున్న డబ్బుతో పది తులాల బరువైన రెండు జతల బంగారు కత్తెరలను కొనుగోలు చేశానని తెలిపారు. తమ సెలూన్‌ తిరిగి తెరుచుకోవడంతో పాటు తోటి సెలూన్‌ నిర్వాహకుల సంతోషాన్ని వ్యక్తం చేసేందుకే తొలి కస్టమర్‌కు హెయిర్‌ కట్‌ చేసేందుకు బంగారు కత్తెర్లను ఉపయోగించానని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగానే ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నానని మాస్క్‌లు, శానిటైజర్‌లు వాడటంతో పాటు సీట్లను శానిటైజ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

చదవండి : జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

మరిన్ని వార్తలు