మదర్సాలో జాతీయగీతం పాడాలన్నందుకు..

6 Jan, 2016 13:36 IST|Sakshi
మదర్సాలో జాతీయగీతం పాడాలన్నందుకు..

కోల్‌కతా: కాజీ మసూం అఖ్తర్‌.. కోల్‌కతాలోని తల్పుకుర్ ఆరా ఉన్నత మదర్సాలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ గీతాన్ని పాడాలని విద్యార్థులకు బోధించినందుకు ఆయనపై మౌలానాలు, వారి అనుచరులు దాడి చేశారు. దాడికి పాల్పడిన మౌలానాలకు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులన్న ముద్ర ఉంది. తనపై దాడి గురించి అఖ్తర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్‌ను ఆరుసార్లు కలిసినా ఆయనకు ఎలాంటి మద్దతుగానీ, హామీగానీ లభించలేదు. ఇప్పటికే మౌలానాలు అఖ్తర్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీచేశారు. అంతేకాకుండా జాతీయ గీతం దైవదూషణేనని, అది హిందూత్వ గీతమని వారు పేర్కొన్నారు.

గత ఏడాది మార్చ్‌లో అఖ్తర్‌పై కొందరు దుండగులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో తలకు తీవ్ర గాయమైన ఆయన కొన్ని నెలలపాటు ఆస్పత్రి మంచానికే పరిమితమయ్యాడు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంపికైన ఉపాధ్యాయుడైనప్పటికీ అఖ్తర్‌ మదర్సాలోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ ఫత్వా జారీచేశారు. ముస్లిం వస్త్రాలైన కుర్తా, పైజామా ధరించి.. గడ్డాన్ని పెంచితేనే ఆయనను మదర్సాలోకి అనుమతిస్తామని, గడ్డం ఎంతవరకు పెంచాలనేది కూడా మౌలానాలే నిర్ణయిస్తారని ఫత్వాలో పేర్కొన్నారు. గడ్డం పెరుగుదల గురించి ప్రతివారం ఫొటోలు పంపుతూ తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇంత జరుగుతున్నా.. మత ఉద్రిక్తతల కారణంగా అఖ్తర్‌కు భద్రత కల్పించలేమంటూ కోల్‌కతా పోలీసు కమిషనర్‌ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌కు లేఖ రాయడం గమనార్హం.

మరిన్ని వార్తలు