కోల్‌కతా పోలీస్‌ బాస్‌ను విచారించిన సీబీఐ

10 Feb, 2019 03:40 IST|Sakshi

నేడు మళ్లీ విచారణ

మాజీ ఎంపీ కునాల్‌ ఘోష్‌ కూడా

షిల్లాంగ్‌: కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను సీబీఐ అధికారులు శనివారం విచారణ జరిపారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం ప్రారంభమైన విచారణ 9 గంటలపాటు కొనసాగింది. మధ్యలో విరామం సమయంలో బయటకు వచ్చిన ఆయన టీఎంసీ నేత, లాయర్‌ విశ్వజిత్‌ దేవ్, సీనియర్‌ ఐపీస్‌ అధికారులు జావెద్‌ షమీమ్, మురళీధర్‌ వర్మలతో మాట్లాడారు. శారదా చిట్‌ఫండ్‌ స్కాంకు చెందిన కీలక పత్రాల అదృశ్యంపై ఆదివారం రాజీవ్‌ను ప్రశ్నించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి టీఎంసీ మాజీ ఎంపీ కునాల్‌ ఘోష్‌ను కూడా ఆదివారం విచారించనున్నట్లు సీబీఐ తెలిపింది.

చిట్‌ఫండ్‌ కుంభకోణంపై మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌కుమార్‌ నేతృత్వం వహించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు బాధ్యతలను చేపట్టిన సీబీఐ..కుంభకోణంలోని కీలక ఆధారాలు కనిపించకుండాపోయినట్లు గుర్తించింది. వాటిపై విచారణకు సీబీఐ యత్నించగా కుమార్‌ సహకరించలేదు. గత వారం కుమార్‌ ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులను పోలీసులు నిర్బంధించడం, సీఎం మమతా బెనర్జీ ఆందోళనకు దిగడం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తటస్థప్రాంతమైన షిల్లాంగ్‌లో సీబీఐ అధికారులు రాజీవ్‌కుమార్‌ నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు