స్కూల్‌ టీచర్‌కు ఘోరమైన ప్రశ్నలు..

19 Jun, 2018 20:42 IST|Sakshi

కోల్‌కతా : ఆమె ఒక స్కూల్‌ టీచర్‌. ఎంఏ జియోగ్రఫీలో, ఇంగ్లీష్‌లో రెండింటిలో ఎంఏ ఉంది. వీటితో పాటు బీఎడ్‌, పదేళ్ల పాటు అనుభవం కూడా ఉన్నాయి. కానీ ట్రాన్స్‌జెండర్‌ అన్న ఒకే ఒక్క కారణంతో ఆమెకు, ఘోరమైన ప్రశ్నలు వేశారు. ఘోరమైన ప్రశ్నలతోపాటు అవసరమైన అర్హతలు, అనుభవమున్నప్పటికీ, టీచర్‌ ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. ఇదీ ట్రాన్స్‌జెండర్‌గా మారిన 30 ఏళ్ల సుచిత్ర దే కు ఎదురైన భయానక అనుభవం. హిరాన్మే దే, 2017లో సెక్స్‌ రీసైన్మెంట్‌ సర్జరీ చేయించుకుని సుచిత్ర దేగా మారారు. అయితే ఆమె ఇటీవల కొన్ని టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 

10 ఏళ్ల అనుభవం, విద్యార్హతలు ఉన్నప్పటికీ, వాటిని వేటినీ పట్టించుకోకుండా.. ఆమెను అభ్యంతరకరంగా ప్రశ్నలు వేసినట్టు సుచిత్ర చెప్పారు. ఈ దేశంలో థర్డ్‌ జెండర్‌ చెందిన వారి విషయంలో వేటినీ పట్టించుకోకుండా.. కేవలం వారి జీవితాన్ని హేళనగా చూస్తు ఉంటారని ఆమె వాపోయారు. తన విషయంలో కూడా కేవలం జెండర్‌నే పరిగణలోకి తీసుకుని ఉద్యోగం ఇవ్వడానికి వారు నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్‌ వద్ద ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొన్నారు.

సర్జరీకి ముందు తాను కోల్‌కతాలోని థకుర్పుకూర్ ప్రాంతంలో ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశానని, ప్రస్తుతం అక్కడే టీచర్‌గా కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. తనను మళ్లీ తన స్కూల్‌ చేర్చుకోవడానికి స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ ఒప్పుకుందని, ఎట్టకేలకు తన జీవితాన్ని పునఃప్రారంభించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఐదో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్నట్టు చెప్పింది. తమిళనాడులో కూడా ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఇదే రకమైన అనుభవం ఎదురైంది. ట్రాన్స్‌జెండర్‌కు చెందినది అని ఒకామెకు ఎయిరిండియాలో ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. ఈ విషయంపై ఆమె, రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌కు లేఖ రాశారు.

మరిన్ని వార్తలు