అది ప్రమాదమా? హత్యా?

16 Jan, 2016 09:33 IST|Sakshi
అది ప్రమాదమా? హత్యా?

కోల్ కత్తా ఎయిర్ ఫోర్స్  అధికారి అభిమన్యు గౌడ్ మరణానికి కారణమైన కారు ప్రమాద ఘటన.. కేవలం ప్రమాదవశాత్తూ జరిగిందా .. లేదంటే దీని వెనక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఆడీ కారు డ్రైవింగ్ సీట్ లో తృణముల్ కాంగ్రెస్ నేత మహ్మద్ షోహ్రబ్ కుమారుడు సంబియా ఉన్నారని సమాచారం. అంతకు ముందు షోహ్రబ్ పెద్ద కుమారుడు అంబియా ఉన్నట్లు వార్తలు వచ్చినా.. పోలీసులు మాత్రం సంబియా డ్రైవింగ్ చేస్తున్నాడని తేల్చారు. అయితే ప్రమాదం జరిగిన నాటి నుంచి షోహ్రబ్ తో పాటు.. అతడి ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నారు.

మరో వైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు చేపట్టి 48 గంటలు గడిచినా.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఒక్కరిని కూడా అర్టెస్టు చేయక పోవడం విమర్శలకు దారి తీస్తోంది.  ఈనెల 13న కోలకతాలో రిపబ్లిక్ డే  పరేడ్  రిహార్సిల్స్ చేస్తుండగా విమానయాన అధికారి అభిమన్యు గౌడ్ ను కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  అయితే ఆ రోజు ఉదయం... రిపబ్లిక్ డే పెరేడ్ రిహార్సిల్స్ జరిగే రోడ్డులోకి ఘటనకు  కారణమైన కారు ప్రవేశించేందుకు ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ రోడ్డులోకి కారును పోలీసులు  అనుమతించలేదు.

తర్వాత కాసేపటికే ఆడీ కారు దగ్గరలోని మరో ప్రవేశమార్గం నుంచి రాంగ్ రూట్ లో వచ్చింది. ఘటనకు ముందు కారు సిగ్నల్ జంప్ చేసినట్లు సీసీ ఫుటేజీల్లో రికార్డైంది.  ఘటన జరిగిన వెంటనే  డ్రైవర్ కారు నంబర్ ప్లేట్ తొలగించి... అక్కడి నుంచి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.


 కాగా ఈ కేసు విచారణపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ఈ అంశం మీద సీపీఎం ఎంపీ మహ్మద్ సలీమ్ కోల్ కత్తాలో మీడియాతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన ఐదు గంటల వరకూ  పోలీసులుఎలాంటి చర్య చేపట్టలేదన్నారు. వెంటనే కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ఉంటే బాగుండేదని, అలా చేయకపోవడం వల్ల ఘటనకు కారణమైన వారు తప్పించుకోవడానికి తగినంత సమయం దొరికిందని విమర్శించారు.

 

మరిన్ని వార్తలు