వరద బీభత్సం : విరాళం ప్రకటించిన తలైవా

18 Aug, 2018 19:32 IST|Sakshi

కొచ్చి : పర్యాటక స్వర్గధామం, దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన కేరళ వరణుడి ప్రకోపానికి విలవిల్లాడుతోంది. తొమ్మిది రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న కేరళ వాసులకు సాయం చేసేందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు, మీడియా సంస్థలు, బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ వరద బాధితుల కోసం తమిళ సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

తలైవా రజనీకాంత్‌ 15 లక్షలు,  హీరోలు.. విజయ్‌ సేతుపతి 25 లక్షలు, ధనుష్‌ 15 లక్షలు,  సిద్ధార్థ్‌ 10 లక్షలు, దర్శకుడు శంకర్‌ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. హీరోయిన్‌ నయనతార కూడా 10 లక్షల రూపాయల సాయం ప్రకటించి పెద్ద మనసు చాటుకున్నారు. కాగా తమిళనాడు ప్రభుత్వం 5 కోట్ల రూపాయలతో పాటు 2 కోట్ల విలువ చేసే 300 టన్నుల పాలపొడి, 500 టన్నుల బియ్యం, దుప్పట్లు, ఇతర సామాగ్రి సాయంగా అందజేసింది. మరోవైపు తమిళనాడు ఐఏఎస్‌ అధికారులు కూడా ఒకరోజు వేతనాన్ని సాయంగా ప్రకటించారు.

కాగా ఇంతకుముందే కమల్‌హాసన్‌ రూ. 25లక్షలు,  తమిళ హీరోలు సూర్య, కార్తి 25లక్షలు విరాళమిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళ నటులతో పాటు మలయాళం నటులు మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌ కేరళ వరద బాధితులకు తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. వీరితో పాటు అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్‌ (అమ్మా) 10కోట్ల రూపాయలను కేరళ సీఎం సహాయ నిధికి విరాళమిస్తున్నట్టు ప్రకటించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు