న్యాయవ్యవస్థలో మౌలిక కొరత: సీజేఐ

2 Sep, 2018 03:49 IST|Sakshi
సింపోజియం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీజేఐ దీపక్‌ మిశ్రా. చిత్రంలో రాష్ట్రపతి కోవింద్, సుప్రీం జడ్జీలు గొగోయ్, జోసెఫ్, లోకూర్, అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌

న్యూఢిల్లీ: న్యాయ పరిపాలనపై మచ్చ రావడానికి ముందుగానే న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కొరతను అధిగమించాల్సి ఉందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా అన్నారు. మౌలిక సౌకర్యాల లేమికి ఆర్థికపరమైన అవరోధాలను సాకుగా చూపకూడదన్నారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ అసోసియేషన్‌ నిర్వహించిన సింపోజియంలో రాష్ట్రపతి కోవింద్‌తోపాటు సీజేఐ పాల్గొన్నారు. ‘మౌలిక వనరుల కొరత తీవ్రమై, న్యాయ పరిపాలనకు హాని కలిగించక ముందే చర్యలు తీసుకోవాల్సి ఉంది.

నాణ్యమైన, జవాబుదారీ తనంతో కూడిన సత్వర న్యాయం అందించడానికి, న్యాయ ఉద్దేశం నెరవేరేందుకు న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది’ అని సీజేఐ అన్నారు. సామాన్యుడికి న్యాయం అందించటానికి, కక్షిదారులకు వసతులు, న్యాయవాదులకు అవసరమైన సౌకర్యాలను కల్పించాలంటే న్యాయస్థానాల పరిధి పెరగాలన్నారు. కాగా, చాలా కేసుల్లో కక్షిదారులు వాయిదాలు కోరడం సర్వసాధారణంగా మారిందని, కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులకు ఇది కూడా ఒక కారణమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

మరిన్ని వార్తలు