బస్సుల పరుగు!

18 Oct, 2014 01:42 IST|Sakshi
బస్సుల పరుగు!

దీపావళి ప్రత్యేక బస్సులు రోడ్డెక్కాయి. శుక్రవారం నుంచి ఆయా నగరాలు, జిల్లా కేంద్రాలకు పరుగులు తీశాయి. కోయంబేడులో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీని క్రమ బద్ధీకరించే విధంగా చర్యలు తీసుకున్నారు.

* రోడ్డెక్కిన ప్రత్యేక సర్వీసులు
* కోయంబేడులో పార్కింగ్ ఏర్పాట్లు

సాక్షి, చెన్నై: వెలుగుల పండుగ దీపావళిని ఇంటిల్లి పాది ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం అవుతున్నారు. స్వగ్రామాలకు తరలి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో, సోమ, మంగళ వారాలు సెలవులు పెట్టుకున్న ఉద్యోగులు తమ స్వగ్రామాలకు బయలు దేరారు. రైళ్లు ఇప్పటికే హౌస్‌ఫుల్ కాగా, బస్సుల మీద దృష్టి పెట్టక తప్పలేదు. ఓ వైపు ఆమ్నీ బస్సులు, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ బస్సులు చెన్నై నుంచి దక్షిణాదిలోని జిల్లాలకు పరుగులు తీయడానికి రెడీ అయ్యాయి. ప్రభుత్వ ప్రత్యేక బస్సులు శుక్రవారం రోడ్డెక్కాయి.
 
చర్యలు: దీపావళిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 8 వేలకు పైగా ప్రత్యేక బస్సుల్ని నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చెన్నై  నుంచి దక్షిణాది జిల్లాలకు, కొంగు మండాలనికి, డెల్టా జిల్లాలకు 4 వేల బస్సులు పరుగులు తీసే విధంగా ఏర్పాట్లు చేశారు. కోయంబేడులోని ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించే విధంగా శుక్రవారం నుంచి బస్సులు రోడ్డెక్కించారు. తొలి రోజు 500 బస్సులు నడిచాయి. శనివారం మరో 500, ఆదివారం 700, సోమవారం 2100, మంగళవారం 1652 బస్సుల్ని నడిపేందుకు సర్వం సిద్ధం చేశారు. అలాగే, కోయంబేడు మార్కెట్ పరిసరాల్ని ప్రత్యేక బస్సులకు పార్కింగ్ స్టాండ్‌గా నిర్ణయించారు. అలాగే, ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికుల కోసం టెర్మినల్ ముందు భాగంలో 21 కౌంటర్లను ఏర్పాటు చేశారు.
 
ప్రత్యేక ఏర్పాట్లు : కోయంబేడు టెర్మినల్‌లో తొమ్మిది అతి పెద్ద ఫ్లాట్ ఫారాలు ఉన్నాయి. ఒక్క ఫ్లాట్ ఫాంలో 50కు పైగా బస్సుల్ని నిలబెట్టేందుకు వీలుంది. ఈ ఫ్లాట్ ఫారాలను దీపావళిని పురస్కరించుకుని విభజించారు. ఒకటి, రెండు ఫ్లాట్ ఫారాలను అన్ రిజర్వుడ్‌తో నడిచే బస్సుల కోసం సిద్ధం చేశారు. ఇక్కడ  200 కి. మీ దూరంలోపు ప్రయాణించే బస్సులు, వేలూరు, కాంచీపురం, విల్లుపురం వరకు నడిచే బస్సులు ఉంటాయని  బోర్డుల్ని ఏర్పాటు చేశారు.  3, 4, 5, 6 ఫ్లాట్ ఫారాల్లో మదురై, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి తదితర దక్షిణాది జిల్లాలకు వెళ్లే బస్సులు ఉంటాయి. 7, 8, 9ఫ్లాట్ ఫారాల్ని సుదూర ప్రాంతాలకు వెళ్లే అన్‌రిజర్వుడ్ బస్సులకు కేటాయించారు. అలాగే, మహిళలు, పిల్లలతో వెళ్లే వారి కోసం ఈ ఫ్లాట్ ఫారాల వద్ద ఉన్న కౌంటర్లలో ప్రత్యేక టోకెన్లు ఇస్తున్నారు. ఈ టోకెన్ల ఆధారంగా బస్సుల్లో సీట్లు సులభంగా చిక్కుతాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా