అభివృద్ధికి ఆర్థిక సాయం చేయండి

21 Jul, 2016 04:04 IST|Sakshi
అభివృద్ధికి ఆర్థిక సాయం చేయండి

కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ వినతి
వెంకయ్యనాయుడు, స్మృతీ ఇరానీలతో సమావేశం

 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు తగిన ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవా రం ఆయన ఇక్కడ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి స్మృతీ ఇరానీతో భేటీ అయ్యారు. తొలుత వెంకయ్యతో సమావేశమైన కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం నెల కొల్ప తలపెట్టిన హైదరాబాద్ ఫార్మా సిటీకి భూసేకరణ జరిపేందుకు అవసరమైన నిధుల కోసం హడ్కో నుంచి రూ.785 కోట్ల రుణం ఇచ్చేలా సహకరించాలని కోరారు.

మూసీ నది ప్రక్షాళనలో భాగంగా రెండో దశ పనులకు రూ.930 కోట్ల నిధులను నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రణాళిక కింద మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా నిర్మిస్తున్న స్కై వేలు, ఫ్లై ఓవర్ల నిర్మా ణం గురించి ఆయనకు వివరించారు. డ్రైనేజీలు, రోడ్ల ఆధునీకరణకు వివిధ కార్పొరేషన్ల ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నామని, కేంద్రం కూడా ఆర్థికంగా సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఫార్మా సిటీని నిర్మిం చనున్నామని వివరించారు.

 కార్మికుల కష్టాలను వివరించాం..
బుధవారం సాయంత్రం కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతీ ఇరానీని ఆమె కార్యాలయంలో కలిసిన.. కేటీఆర్ చేనేత కార్మికుల కష్టాలను, వాస్తవ పరిస్థితులను ఆమెకు వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మిక క్షేత్రాలైన సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్, నారాయణ్‌పేట్‌లోని కార్మికుల సమస్యలను లిఖితపూర్వకంగా కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. కార్మికుల కష్టాలను తెలుసుకునేందుకు కేంద్రమంత్రి రాష్ట్రానికి వస్తానని తెలిపారని, ఆ పర్యటనలో కార్మికుల సమస్యలపై హైదరాబాద్‌లో సమావేశం కూడా నిర్వహిస్తానని హామీ ఇచ్చారని వివరించారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీకి ఇచ్చిన ప్రతిపాదనలను తమ శాఖకు ఇస్తే టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు తమ శాఖ నుంచి తగిన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. అంతేకాక కొత్త క్లస్టర్లు, శిక్షణ అంశాలపై కేంద్రమంత్రి సాయం కోరామన్నారు.

మరిన్ని వార్తలు