కేంద్రమంత్రి పీయూష్‌తో కేటీఆర్‌ సమావేశం

10 Jan, 2020 11:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ఉదయం సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రితో భేటీ అయిన కేటీఆర్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లో జరిగే బయో ఆసియా సదస్సుకు రావాల్సిందిగా కేంద్ర మంత్రిని కేటీఆర్‌ ఆహ్వానించారు. వరంగల్‌-హైదరాబాద్‌ కారిడార్‌, హైదరాబాద్‌-నాగపూర్‌ కారిడార్‌లు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్‌-బెంగళూరు-చెన్నైను కలుపుతూ నాలుగు రాష్ట్రాల మధ్య దక్షిణాది పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విన్నవించారు.

ఇందుకోసం కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేటీఆర్‌ కోరారు. ఈ అంశంపై దక్షిణాది మంత్రులకు లేఖలు కూడా రాశామని పేర్కొన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న డ్రైపోర్టుతోపాటు మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులకు మద్దతు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ ఫార్మా క్లస్టర్‌ అయిన ‘హైదరాబాద్‌ ఫార్మా సిటీ, జహీరాబాద్‌ నిమ్స్‌’ వివరాలను కేంద్ర మంత్రి అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌ ప్రస్తావించిన అంశాలపై వెంటనే ఒక నివేదిక ఇవ్వాలని పీయూష్‌ గోయల్‌ తన కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.


చదవండి
న్యూజిలాండ్‌తో కలసిపనిచేస్తాం: మంత్రి కేటీఆర్‌
తెలంగాణకు ఈ రెండు ప్రాధాన్య రంగాలు

మరిన్ని వార్తలు