'ఆ ఆరోపణలు అవాస్తవం, కావాలనే రాద్ధాంతం'

14 Apr, 2017 16:17 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌  కుల్‌భూషణ్‌ జాదవ్‌పై చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి వీకే సింగ్‌ తోసిపుచ్చారు. జాదవ్‌ నిర్దోషి అని, అతని వద్ద భారత పాస్‌పోర్టు ఉందని  ఆయన అన్నారు. వీకే సింగ్‌ శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.... జాదవ్‌పై గూఢచర్యం ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. పాకిస్తాన్‌ కావాలనే రాద్ధాంతం చేస్తోందని ధ్వజమెత్తారు. కాగా భారత గూఢచారిగా అనుమానిస్తున్న కుల్‌భూషణ్‌ జాదవ్‌ కు సోమవారం పాకిస్తాన్‌ మిలటరీ కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. జాదవ్‌ గూఢచర్యం, విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్న ఫీల్డ్‌ జనరల్‌ కోర్టు మార్షల్‌ ఆయన్ను దోషిగా పేర్కొన్నారు.

అయితే పాక్‌ నిర్ణయాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. జాదవ్‌కు మరణశిక్ష అమలుచేస్తే దీన్ని ముందుగానే ఆలోచించి చేసిన హత్యగా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన పాక్‌ జాదవ్‌కు తక్షణమే ఉరి అమలు చేయమని, క్షమాభిక్షకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.  కాగా జాదవ్‌ తరఫున ఎవరు వాదించొద్దని లాహోర్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం చేసింది.
మరోవైపు కుల్‌భూషణ్‌ అమాయకుడు అయితే అతని వద్ద రెండు పాస్‌పోర్టులు ఎందుకు ఉంటాయని, ఒకటి హిందు, మరొకటి ముస్లిం పేరుతో పాస్పోర్టులు ఉన్నాయని పాక్‌ ప్రధాని సలహాదారుడు సత్తాజ్‌ అజీజ్‌ ప్రశ్నించారు.

>
మరిన్ని వార్తలు