ఉన్నావ్‌ కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు

16 Dec, 2019 15:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ సెంగార్‌ను దోషిగా తేల్చింది. కేసుపై సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం సోమవారం తీర్పును వెలువరించింది. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లపై కేసును విచారించిన ధర్మాసనం ఐపీసీ సెక్షన్‌ 376 (అత్యాచారం) కింద అతన్ని దోషిగా తేల్చింది. ఈ నెల 19న శిక్షను ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. తనను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌పై ఓ మైనర్‌ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం నమోదైన ఈ కేసుకు సంబంధించి రహస్య విచారణ చేపట్టారు. సీబీఐ వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. కాగా బీజేపీకి చెందిన కుల్దీప్‌ సింగ్‌ ఉన్నావ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. ప్రస్తుతం ఆయన తీహార్‌ జైలులో ఉన్నాడు.

ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి న్యాయమూర్తి ధర్మేశ్‌ శర్మ ఈ కేసుపై రోజువారీ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చొరవతో ఈ కేసు లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ అయింది. 2017లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగార్‌ ఓ బాలికను కిడ్నాప్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి శశిసింగ్‌ అనే వ్యక్తిపై అభియోగాలు నమోదయ్యాయి కూడా. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై కూడా అభియోగాలు నమోదు కాగా బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. నేరపూరిత కుట్ర (120బీ), కిడ్నాప్‌ (363), పెళ్లికి బలవంత పెట్టడం (366), అత్యాచారం (376) తదితర అంశాలతోపాటు లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే చట్టం(పోక్సో) కింద ఆ ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి.

అభియోగాల నమోదుకు సుమారు పది రోజుల ముందు అత్యాచార బాధితురాలు ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ట్రాక్టర్‌ ఢీకొనడంతో బాధితురాలి సన్నిహిత బంధువులు ఈ ప్రమాదంలో మరణించారు. బాధితురాలి తండ్రిపై ఉత్తరప్రదేశ్‌లో ఓ హత్య కేసు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఈ కేసును ఢిల్లీ కోర్టుకు బదిలీ చేసింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు