తమ్ముడితో నాకు గొడవలేంటి: సీఎం

1 May, 2017 08:17 IST|Sakshi
తమ్ముడితో నాకు గొడవలేంటి: సీఎం

ఆప్ కోటకు బీటలు వారుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన కుమార్ విశ్వాస్ కూడా చేజారిపోతున్నట్లు సంకేతాలు అందుతుండటంతో.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలవరపడ్డారు. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని మరీ కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారని పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించడంతో వెంటనే సీఎం స్పందించారు. తనకు, కుమార్ విశ్వాస్‌కు అసలు గొడవలేమీ లేవని.. అతడు తన తమ్ముడి లాంటి వాడని చెప్పారు. అయితే ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున ఆఫర్ ఇచ్చి మరీ కుమార్ వివ్వాస్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లిపోతున్నారని అమానతుల్లా ఖాన్ అంటున్నారు. ఈ మేరకు ఆయన వాట్సప్‌లో ఓ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి.. తనను పార్టీ కన్వీనర్ చేయాలని కుమార్ విశ్వాస్ చెప్పారన్నది ఖాన్ వాదన. ఇదంతా బీజేపీయే చేయిస్తోందని ఆయన అన్నారు. సుమారు 14 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోపించారు.

అతడు నా తమ్ముడు..
కుమార్ విశ్వాస్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని, కొంతమంది వ్యక్తులు తామిద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వాళ్లు పార్టీకి శత్రువులని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమను ఎవ్వరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ నాయకత్వం మార్పు దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని కుమార్ విశ్వాస్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినా.. ఆప్‌కు వచ్చిన స్థానాలు చాలా తక్కువ.

మరిన్ని వార్తలు