కేజ్రీవాల్‌ రాజీమార్గం

16 Mar, 2018 02:09 IST|Sakshi

చండీగఢ్‌: శిరోమణి అకాలీ దళ్‌ నేత, మాజీ మంత్రి విక్రమ్‌ సింగ్‌ మజీతియాకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ క్షమాపణలు చెప్పారు. మాదక ద్రవ్యాల రాకెట్‌తో మజీతియాకు సంబంధముందంటూ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆ సమయంలో రాష్ట్ర కేబినెట్‌ మంత్రి కూడా అయిన మజీతియా కోర్టులో కేజ్రీవాల్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఈ ఆరోపణలు అవాస్తవాలని ఇటీవల కేజ్రీవాల్‌ అంగీకరించటంతోపాటు తనకు కోర్టులో లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పారని మజీతియా చెప్పారు.

ఈ విషయాన్ని ఆయన మీడియాతో చెప్పారు. కేజ్రీవాల్‌ క్షమాపణలను స్వీకరిస్తున్నానన్నారు. కేజ్రీవాల్‌తోపాటు క్షమాపణలు చెప్పిన ఆప్‌ నేత ఆశిష్‌ ఖేతాన్‌పై వేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై ఆప్‌ ఢిల్లీ విభాగం అధికార ప్రతినిధి భరద్వాజ్‌ మాట్లాడుతూ ‘సీఎం కేజ్రీవాల్‌పై వారణాసి, అమేథీ, పంజాబ్, అస్సాం, మహారాష్ట్ర, గోవా తదితర ప్రాంతాల్లో 20కి పైగా సివిల్, క్రిమినల్‌ కేసులున్నాయి.

వీటి కోసం ముఖ్యమంత్రి బాధ్యతలను పక్కనబెట్టి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ కేసులన్నీ ఆయన రాజకీయ ప్రత్యర్ధులు పెట్టినవే. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత వరకు రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని పార్టీ న్యాయవిభాగం నిర్ణయించింది’ అని అన్నారు. ఓ కేసుకు సంబంధించి కేంద్రమంత్రి జైట్లీకి కూడా కేజ్రీవాల్‌ క్షమాపణలు చెప్పనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.  

మరిన్ని వార్తలు