కుంభమేళాలో కోటిన్నర మంది

11 Feb, 2019 02:53 IST|Sakshi

వసంత పంచమి  సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలు

ప్రయాగ్‌రాజ్‌: వసంత పంచమి సందర్భంగా ఆదివారం కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. తీవ్ర చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలకు బారులు తీరారు. కుంభమేళాలో నిర్వహించే షాహీ స్నానాల్లో ఇదే ఆఖరు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 1.5 కోట్ల మంది కుంభమేళా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారని అధికారులు వెల్లడించారు. సూర్యోదయానికి ముందు దాదాపు 50 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు తెలిపారు. ఈ నెల 9 వరకు దాదాపు 16.44 కోట్ల మంది కుంభమేళాకు హాజరైనట్లు అధికారులు చెప్పారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మకర సంక్రాం (జనవరి 15) నుంచి ప్రారంభమైన కుంభమేళా మహాశివరాత్రి (మార్చి 4) తో ముగుస్తుంది.  


ఆదివారం వసంత పంచమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళాకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు 

రామనామమే డబ్బు! 
కుంభమేళాలో ప్రధాన ఆకర్షణల్లో ‘రామ్‌నామ్‌ బ్యాంక్‌’ ఒకటి. దీనిలో భక్తులకు 30 పేజీలు ఉన్న పుస్తకాలను ఇస్తారు. ఒక్కో పేజీలో 108 కాలమ్స్‌ ఉంటాయి. వీటిలో రామనామాన్ని రాయాల్సి ఉంటుంది. రాయడం పూర్తయ్యాక ఈ పుస్తకాన్ని బ్యాంక్‌లో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ నామాలన్నీ అతని అకౌంట్‌లో జమ అవుతాయి. ఈ ప్రక్రియను డిజిటలైజ్‌ చేశామని.. రామ్‌నామ్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారి తెలిపారు.

కుంభమేళాలో మహంత్‌ రాథే పూరీ అనే వ్యక్తి కుడి చేతిని పైకి లేపి స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీలా నిల్చున తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. 2011 నుంచి తాను ఇలానే ఉన్నానని పూరీ చెప్పాడు.  ప్రపంచశాంతి కోసమే ఇదంతా అని ఆయన తెలిపాడు. ‘డబుల్‌ కొకోనట్‌ పామ్‌ సీడ్‌’ పేరిట ప్రదర్శించిన కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించిన కొబ్బరి విత్తనం బరువు 30 కిలోలు ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విత్తనమని అధికారులు వెల్లడించారు.  

సీఎం కృతజ్ఞతలు..  
కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించినందుకు గానూ అఘోరాలు, సాధువులకు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అయితే, కుంభమేళాకు 15 కోట్ల మంది భక్తులు వచ్చారని చెబుతోన్న ప్రభుత్వంపై రాష్ట్ర మంత్రి, సుహల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ నేత ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ మండిపడ్డారు. ఏ లెక్కల ప్రకారం 15 కోట్ల మంది వచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు.

మరిన్ని వార్తలు