‘పీఎం–కిసాన్‌’కు శ్రీకారం

25 Feb, 2019 04:53 IST|Sakshi

యూపీలో ప్రారంభించిన మోదీ

తొలి విడతలో కోటి మంది రైతుల ఖాతాల్లోకి రూ. 2వేలు జమ

విపక్షాలకు రైతులు పదేళ్లకోసారే గుర్తొస్తారని ప్రధాని ధ్వజం

కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ  

గోరఖ్‌పూర్‌/ప్రయాగ్‌రాజ్‌: ప్రధాన మంత్రి రైతు గౌరవ నిధి (పీఎం–కిసాన్‌) పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌ (యూపీ)లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించారు. తొలి విడతగా 1.01 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,000 డబ్బును ఆయన బదిలీ చేశారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే ఈ మొత్తం అందుతుందని మోదీ చెప్పారు. ప్రతిపక్షాలకు పదేళ్లకు ఒకసారి మాత్రమే, ఎన్నికలకు ముందు రైతులు గుర్తొస్తారని ఆయన విమర్శలు చేశారు. గోరఖ్‌పూర్‌లోని భారతీయ ఎరువుల కార్పొరేషన్‌కు చెందిన మైదానంలో మోదీ మాట్లాడుతూ ‘ఎన్నికలు వస్తున్నాయంటే ఓట్ల కోసం వాళ్లు (విపక్షాలు) రైతు రుణమాఫీని ప్రకటిస్తారు.

పదేళ్లకోసారి, ఎన్నికలప్పుడు మాత్రమే వాళ్లు వ్యవసాయదారులను గుర్తు చేసుకుంటారు. వాళ్ల బండారాన్ని ఈ సారి మోదీ బయటపెడతాడని వాళ్లకు తెలీదు’ అని అన్నారు. జై జవాన్, జై కిసాన్‌ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తమ ప్రభుత్వం రూ.75 వేల కోట్లతో ఈ పీఎం–కిసాన్‌ పథకాన్ని అమలు చేస్తోందనీ, ఇదేమీ తాము ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ కాదని తెలిపారు. ‘రుణమాఫీ చేయడం సులభమే. మాకూ అదే సౌకర్యంగా ఉండేది. రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం మేం కూడా తాయిలాలను ప్రకటించి ఉండొచ్చు. కానీ అలాంటి పాపానికి మేం ఒడిగట్టలేం. రుణమాఫీ వల్ల కొంత మంది రైతులకే ప్రయోజనం దక్కుతుంది’ అని మోదీ చెప్పారు. పీఎం–కిసాన్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సర మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించడం తెలిసిందే. 

వాళ్లకు రైతుల శాపం తగులుతుంది 
పీఎం–కిసాన్‌ పథకానికి అర్హులైన రైతుల    జాబితాను పంపకుండా కొన్ని రాష్ట్రాలు     రాజకీయాలు చేస్తున్నాయనీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లోని వారికి రైతుల శాపం తగులుతుందని మోదీ పేర్కొన్నారు. ఆ శాపం వారి రాజకీయాలను నాశనం చేస్తుందన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్‌ లక్ష్యంగా మోదీ విమర్శలు చేస్తూ.. ‘పదేళ్లలో కేవలం రూ. 52 వేల కోట్ల రుణాలను వారు మాఫీ చేశారు. ఇక నుంచి మా ప్రభుత్వం ప్రతీ ఏడాది రైతులకు ఏటా రూ. 75 వేల కోట్లు ఇవ్వనుంది. పంటల కనీస మద్దతు ధర పెంపు అంశాన్ని కాంగ్రెస్‌ పట్టించుకోలేదు. 2007 నుంచి ఆ దస్త్రం కదలలేదు. దీంతో రైతులు అప్పులు చేయాల్సి వచ్చింది. రైతులకు మంచి చేయాలన్న ఉద్దేశం గత ప్రభుత్వాలకు లేదు. కాబట్టే వారు సరైన నిర్ణయాలను తీసుకోలేదు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు అందుబాటులో అన్ని వనరులను వినియోగించుకుంటాం.

నిజాయితీతో పనిచేస్తాం’ అని చెప్పారు. రైతుల కోసం గతంలో ప్రభుత్వాలు తెచ్చే పథకాలు కేవలం కాగితాలపైనే కనిపించేవని మోదీ దుయ్యబట్టారు. ‘పీఎం–కిసాన్‌ వల్ల రైతులు మోదీకి మద్దతుగా ఉంటారని మా ప్రత్యర్థులు నైరాశ్యంలోకి వెళ్లారు. మేం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలం. కాంగ్రెస్, మహా కల్తీ కూటమి, ఎస్పీ, బీఎస్పీ.. వాళ్లంతా ఒక్కటే’ అని అన్నారు. జయలలితకు మోదీ నివాళి.. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత 71వ జయంతి సందర్భంగా మోదీ ఆమెకు నివాళి అర్పించారు. తమిళనాడు రాష్ట్రాభివృద్ధికి ఆమె చేసిన కృషిని మోదీ గుర్తు చేసుకున్నారు. 

కుంభమేళాలో మోదీ పుణ్యస్నానం
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ (ప్రయాగ్‌రాజ్‌)లో జరుగుతున్న కుంభమేళాలో మోదీ ఆదివారం త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానమాచరించారు. అనంతరం అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వాళ్లే నిజమైన కర్మ యోగులంటూ వారి సేవలను మోదీ కొనియాడారు. గంగా హారతి ఇచ్చి పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను కూడా మోదీ కడిగారు. వారికి అంగవస్త్రాలను బహూకరించారు. వారి సేవల వల్లే కుంభమేళా ప్రదేశం శుభ్రంగా ఉందన్నారు. 130 కోట్ల మంది భారతీయులు బాగుండాలని త్రివేణి సంగమం వద్ద తాను కోరుకున్నట్లు మోదీ ట్విట్టర్‌లో చెప్పారు. కుంభమేళాను విజయవంతం చేసేందుకు అవసరమైనదంతా తాము చేశామని మోదీ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
ఉగ్రమూకలను తుడిచిపెట్టేస్తాం
చివరి ‘మన్‌కీ బాత్‌’లో ప్రధాని 

న్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో ఉగ్రస్థావరాలతో పాటు ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్నవారిని తుడిచిపెట్టేయాలని భారత సైన్యం నిర్ణయించిందని ప్రధాని మోదీ తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల ప్రాణత్యాగం ఉగ్రవాద సంస్థలను పునాదులతో సహా పెకిలించడానికి  స్ఫూర్తినిస్తుందన్నారు. ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి కులం, మతం, ప్రాంతం వంటి అడ్డంకులను దాటుకుని ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరిదైన 53వ మాసాంతపు ‘మన్‌కీ బాత్‌’ రేడియో కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఎన్నికల నేపథ్యంలో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్ని 2 నెలల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రధాని  మోదీ తెలిపారు.  

>
మరిన్ని వార్తలు