‘జయలలితను చూడడానికి రోడ్డుపై నిలబడేదాన్ని’

21 May, 2019 08:51 IST|Sakshi

సాక్షి, చెన్నై : దివంగత ముఖ్యమంత్రి జయలలితను చూడడానికి రోడ్డుపై నిలబడేదాన్నని నటి, కాంగ్రెస్‌ పార్టీ ప్రచారకర్త కుష్బూ తెలిపారు. కథానాయకిగా రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు సి. సుందర్‌ని ప్రేమ వివాహం చేసుకున్న కుష్బూ ఆ తరువాత రాజకీయాలు, సినిమాలు, టీవీ.సీరియళ్లు అంటూ బిజీ అయిపోయారు. ఈ సంచలన నటికి పుట్టినిల్లు ఉత్తరాది, మెట్టినిల్లు దక్షిణాది (చెన్నై) అన్న విషయం తెలిసిందే. కాగా కుష్బూ తన చెన్నై అనుభవాలను ఒక భేటీలో పంచుకున్నారు. అవేంటో చేద్దాం. 

చెన్నైతో అనుబంధం
చెన్నై నాకు కుటుంబాన్ని, పేరుప్రఖ్యాతలను అందించింది, నా మనసులోని వేదనలను తీర్చింది. నా పాస్‌బుక్‌లో ముంబాయి వాసిగా పేర్కొని ఉన్నా, మానసికంగా నేను చెన్నైవాసిగానే భావిస్తున్నాను. అలా ఈ ప్రత్యేకమైన చెన్నై మహానగరానికి రుణపడి ఉన్నాను. చెన్నై కాలానుగుణంగా చాలా మర్పు చెందుతోంది. అయినా ఇక్కడ సంస్కృతి మాత్రం వేళ్లూరిపోయింది. మా పిల్లలు ఇక్కడే పెరగడం సంతోషంగా ఉంది.

నిరాశ సంఘటనలు
ఇక్కడ నేను నిరాశ పడిన సంఘటనలు ఉన్నాయి. ఒక నటిగా అన్నాశాలై రోడ్డులో సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు చూడలేకపోవడం విచారకరమైన విషయం. ఇంతకు ముందైతే చిత్ర విడుదల సమయాల్లో మౌంట్‌రోడ్డుకు వెళితే భారీ కటౌట్‌లు, పోస్టర్లు చూసేదాన్ని. నా తొలి తమిళ చిత్రం ధర్మత్తిన్‌ తలైవన్‌ విడుదల సమయంలో మౌంట్‌రోడ్డుకు వెళ్లాను. అక్కడ జనాలు భారీగా గుమిగూడి బ్యానర్‌ను చూస్తుంటడం కంటపడింది. అయితే ఆ బ్యానర్‌లో నటుడు ప్రభు ఫొటో మా త్రమే ఉండటం నాకు కాస్త నిరాశను కలిగించింది.

ఆనంద భాష్పాలు
నా భర్త నటించిన తలైనగరం చిత్ర బ్యానర్‌ను మౌంట్‌రోడ్డులో చూసినప్పుడు నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి. నేను దక్షిణాదిలో మొదటగా తెలుగు చిత్రంలోనే నటించాను. ఆ చిత్రం 1984 జనవరి 1వ తేదీన చెన్నైలోని విజయావాహిని స్టూడియోలోనే ప్రారంభమైంది. ఆ రోజుల్ని నా జీవితంలో మరిచిపోలేను. నటుడు రజనీకాంత్‌కు జంటగా నేను నటించిన పాండియన్‌ చిత్ర షూటింగ్‌ ముత్తుక్కాడు ప్రాంతంలో జరుగుతున్నప్పుడు ఆ చుట్టు పక్కల పజలు రోడ్డంతా నిలబడి చూశారు. ఆ సంఘటనను మరిచిపోలేను.

కరుణానిధి–జయలలిత
ఇక రాజకీయనాయకురాలిగా నాకు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వద్ద చాలా గౌరవం లభించింది. అది నాకు దక్కిన సింహాసనంగా భావిస్తాను. చెన్నైలో చాలా కాలంగా నివసిస్తున్న నేను ఎక్కువగా చూసింది డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలనే. జయలలిత చాలా ధైర్యవంతురాలు. అందుకు నేను ఆమెను అభిమానిస్తాను. జయలలిత కారులో బయటకు వెళుతునప్పుడు ఆమెను చూడడానికి ప్రజలు రోడ్డులో నిలబడేవారు. జయలలిత ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి రోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మ్యూజిక్‌ అకాడమి రోడ్డులో కారులో వెళ్లేవారు. అప్పుడు ప్రజలతో పాటు నేను ఆమెను చూడడానికి రోడ్డుపై నిలబడేదాన్ని. జయలలిత మధ్యాహ్నం భోజనానికి వెళ్లేటప్పుడు నేను ఆమె కారుకు  ఎదురుగా నిలబడేదాన్ని. అలా నన్ను పరిశీలించిన జయలలిత తన సెక్యూరిటీని పంపి నా గురించి విచారించారు. నాకు ప్రశాంతత కావాలనుకున్నప్పుడల్లా మెరినా సముద్ర తీరానికి వెళ్లి కూర్చునేదాన్ని. ఇక టీ.నగర్‌లోని బట్టల దుకాణాలకు వెళ్లి షాపింగ్‌ చే యడం మరచిపోలేని అనుభూతి అని కుష్బూ చెన్నై అనుభవాలను పంచుకున్నారు. 

మరిన్ని వార్తలు