సెప్టెంబరు 25 నుంచి ఖీర్‌ ఉద్యమం!!

31 Aug, 2018 19:11 IST|Sakshi

కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ

పట్నా : ఎన్డీయే కూటమిలో భాగస్వాములైన కొంత మంది వ్యక్తులకు నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావడం ఇష్టం లేదని కేంద్ర మంత్రి, ఆరెస్‌ఎల్పీ అధినేత ఉపేంద్ర కుశ్వాహ వ్యాఖ్యానించారు.  2019 ఎన్నికల దృష్ట్యా పొత్తు విషయమై బిహార్‌లో ఎన్డీఏ పక్షాల మధ్య లోక్‌సభ సీట్ల పంపిణీ ఖరారైన విషయం తెలిసిందే. బీజేపీ, జేడీయూ మధ్య కుదిరిన 20- 20 ఒప్పందం ప్రకారం బీజేపీ 20 స్థానాల్లోనే పోటీ చేస్తుంది. జేడీయూకు 12, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) 7 చోట్ల, ఉపేంద్ర కుశ్వాహ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్‌ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ)కి రెండు చోట్ల బరిలోకి దిగేందుకు ఒప్పందం కుదిరింది. కుశ్వాహతో విభేదిస్తున్న ఎంపీ అరుణ్‌ కుమార్‌కు ఒక స్థానాన్ని ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో అసంతృప్తితోనే కుశ్వాహ ఎన్డీయే సభ్యులపై ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి.

ఖీర్‌ సిద్ధాంతం... ఓ సామాజిక ఉద్యమం..
మోదీ నాయకత్వాన్ని నిలబెట్టేందుకు పైగమ్‌- ఏ- ఖీర్‌ పేరిట సెప్టెంబరు 25 నుంచి సామాజిక ఉద్యమం చేపడుతున్నామని కుశ్వాహ తెలిపారు. బ్రాహ్మణుల దగ్గర నుంచి చక్కెర, చౌదరీల నుంచి తులసి, వెనుకబడిన తరగతులు, దళితులు, ముస్లింల నుంచి డ్రై ఫ్రూట్స్‌ సేకరించి రుచికరమైన ఖీర్‌(పాయసం) తయారు చేస్తామని పేర్కొన్నారు. అందరూ సమానమనే భావన కల్పించేందుకు అన్ని వర్గాల ప్రజలు కలిసి ఖీర్‌ విందులో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

మరిన్ని వార్తలు