సరిహద్దుల్లో తొలగని ప్రతిష్టంభన

1 Jun, 2020 06:40 IST|Sakshi

లదాఖ్‌ ప్రాంతంలో భారత్, చైనా మోహరింపులు

న్యూఢిల్లీ: తూర్పు లదాఖ్‌ ప్రాంతంలో భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. వివాదాస్పద ప్రాంతానికి చేరువలో ఉన్న తమ తమ స్థావరాలకు రెండు దేశాలు భారీ సామగ్రి, ఆయుధ సంపత్తిని తరలిస్తున్నాయి. తూర్పు లదాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖకు సమీపంలోని బేస్‌ల వద్దకు చైనా శతఘ్నులను, పదాతిదళ పోరాట వాహనాలు, భారీ సైనిక సామగ్రిని చేరుస్తోంది. భారత్‌ సైతం శతఘ్నులు, బలగాలను అక్కడికి పంపిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. పాంగోంగ్‌ త్సో, గాల్వాన్‌ లోయ తదితర ప్రాంతాల్లో మునుపటి స్థితిని నెలకొల్పే వరకు వెనుకంజ వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి.

వైమానిక దళాలు వివాదాస్పద ప్రాంతంలో కదలికలపై కన్నేసి ఉంచాయి. మే మొదటి వారంలో చైనా 2,500 బలగాలను ఈ ప్రాంతంలోకి తరలించడం, అక్కడ కొన్ని నిర్మాణాలు చేపట్టడాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభన మొదలైంది. తరచూ రెండు దేశాల సైన్యాల మధ్య ఘర్షణలు జరిగే డెమ్‌చోక్, దౌలత్‌ బేగ్‌ ఓల్డీ ప్రాంతాల్లోనూ చైనా తన బలగాల సంఖ్యను పెంచింది. కాగా, తూర్పు లదాఖ్‌లోని సరిహద్దుల్లో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో భారత్‌ సైనికులకు గాయాలయ్యాయంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోపై సైన్యం స్పందించింది. ‘ఆ వీడియోకు ఎలాంటి ప్రామాణికత లేదు. అక్కడ ఎలాంటి హింస జరగలేదు’అని సైన్యం ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు