మోదీగేట్: ఈసారి ఎన్ని వికెట్లో?

24 Jun, 2015 14:35 IST|Sakshi
మోదీగేట్: ఈసారి ఎన్ని వికెట్లో?

లలిత్ మోదీ.. మన ప్రధాని నరేంద్ర మోదీ కంటే కూడా ఈ పేరుకు ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం. ఐపీఎల్ సృష్టికర్తగా మోదీ ఓ వెలుగు వెలిగారు. సినీ తారలు, కార్పొరేట్ దిగ్గజాలను ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ఐపీఎల్ను సృష్టించారు. ఐపీఎల్ విజయవంతం కావడంలో మోదీదే కీలకపాత్ర. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా లలిత్ మోదీ స్థానం సంపాదించాడంటే ఆయన స్థాయి ఏపాటిదో ఊహించుకోవచ్చు. అయితే ఇదంతా నాణేనికి ఓ పార్శ్వం మాత్రమే.

ఐపీఎల్ కమిషనర్గా ఎంతో కీర్తిప్రతిష్టలు సంపాదించిన మోదీ.. ఆర్థిక అవకతవకలకు పాల్పడి పాతాళానికి దిగజారారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు దేశం నుంచి పారిపోయి లండన్లో తలదాచుకుంటున్నారు. ఈడీ, ఐటీ విచారణలకు సహకరించకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మోదీ ఎఫెక్ట్కు గతంలో కేంద్ర మంత్రి శశిథరూర్ మాత్రమే పదవి పోగొట్టుకోగా.. ప్రస్తుతం ఎంతో మంది పదవులు అనుమానంలో పడ్డాయి.

ఐపీఎల్ ఫ్రాంచైజీ కొచ్చి టస్కర్స్లో నాటి కేంద్రమంత్రి శశి థరూర్ భార్య సునంద్ పుష్కర్  కు వాటాలున్నాయని మోదీ బాంబు పేల్చారు. ఈ యాజమాన్యానికి శశి థరూర్ సాయం చేసినందుకు ప్రతిగా సునందకు ఉచితంగానే వాటాలు ఇచ్చారని మోదీ ఆరోపించారు. ఈ దెబ్బకు థరూర్ మంత్రి పదవి ఊడింది. ఆ తర్వాత మోదీకి కష్టాలు ఆరంభమయ్యాయి. ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఐపీఎల్ కమిషనర్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. కేసు నుంచి తప్పించుకునేందుకు 2010లో మోదీ లండన్ పారిపోయారు.

తాజాగా లలిత్ మోదీ మరో తేనెతుట్టెను కదిపారు. ఆయనకు వీసా మంజూరు విషయంలో సాయం చేశారంటూ ప్రస్తుత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. న్యాయవాదులైన సుష్మా భర్త, కుమార్తె కూడా మోదీ సేవలోనే తరించారంటున్నారు. ఇక రాజస్థాన్ సీఎం వసుంధర రాజె పేరు కూడా మోదీ వీసా విషయంలో బయటకు వస్తోంది. వసుంధర కుమారుడు, ఎంపీ దుష్యంత్ కంపెనీలో లలిత్ మోదీ పెట్టుబడులు పెట్టారు. నిందితుడిగా ఉన్న మోదీకి బీజేపీ నేతలు సాయం చేయడంపై పెద్ద దుమారమే చెలరేగింది. వీరు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ తొలుత మౌనం పాటించినా ఆనక తమవారిని సమర్థించింది. ఈ వివాదం కొనసాగుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఢిల్లీ జిల్లాల క్రికెట్ సంఘం (డీడీసీఏ) కుంభకోణంలో ప్రమేయముందని మోదీ మరో బాంబు పేల్చారు. బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలెన్నో వెల్లడిస్తానని ట్వీట్ చేశారు.

ఇక ఈడీ కేసు విచారణలో నిందితుడిగా అజ్ఞాతంలో ఉన్న మోదీని లండన్లో ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియా కలిసిన సంఘటన వెలుగు చూడటం కలకలం రేపింది. రాకేష్పై చర్యలు తీసుకునేందుకు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సిద్ధం కావడంతో.. ఎన్డీయే పక్షాలు బీజేపీ, శివసేన మధ్య చిచ్చు రగిలింది. మోదీ ఈ వ్యవహారం చివరకు ఎక్కడికి దారితీస్తుందో? ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ఎంతమంది పదవులు ఊడుతాయో?

మరిన్ని వార్తలు