నితీశ్ తలరాత ఇంతే:లాలూ

3 Sep, 2017 12:41 IST|Sakshi
నితీశ్ తలరాత ఇంతే:లాలూ
సాక్షి, పట్నా: కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ బీజేపీ-మిత్రపక్షాల నడుమ చిచ్చుపెట్టిందా? లేదా? అన్నది తేలటానికి కాస్త సమయం పట్టేలా కనిపిస్తున్నప్పటికీ విపక్షాలు మాత్రం ఆ సందర్భాన్ని వాడేసుకుంటున్నాయి. 
 
ముఖ్యంగా తమతో దోస్తీ కటీఫ్ చేసుకుని మరీ మోదీ వెంట వెళ్లిన నితీశ్‌పై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సెటైర్లు వేశారు. ‘కావాల్సిన వాళ్లను వదులుకుని ఆయన వారి వెంటపడ్డారు. కనీసం ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానించలేదు. అది నితీశ్‌ తలరాత’ అంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాలూ పేర్కొన్నారు.
 
రెండు బెర్తులు ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి ముందుకు వచ్చినప్పటికీ నితీశ్‌ మూడు పదవులను డిమాండ్ చేశారని ఓ సమాచారం అందుతోంది. అందుకు బీజేపీ నిరాకరించటంతో నితీశ్ అలకబూనారని, అనవసరంగా ఎన్డీయే కూటమిలో చేరామని బాధపడుతున్నారంటూ రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. ఇక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందకపోవటంపై జేడీ(యూ), శివసేనలు పునర్వ్యవస్థీకరణ బీజేపీకి సంబంధించిందేగానీ ఎన్డీయేది కాదంటూ ఆ పార్టీ నేతలు కేసీ త్యాగి, సంజయ్‌ రౌతులు పేర్కొనటం విశేషం.  అయితే నాలుగో దశ విస్తరణలో జేడీ(యూ)తోపాటు అన్నాడీఎంకేకు చోటు దక్కవచ్చనే సంకేతాలు ఇప్పటికే అందుతున్నాయి.
మరిన్ని వార్తలు