ఎస్పీ నా బాస్‌ అనుకుంటున్నారా : లాలూ

30 Apr, 2018 17:43 IST|Sakshi

న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను ఎయిమ్స్‌ నుంచి రాంచీకి తరలించే క్రమంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ పోలీసు లాలూను వెనక్కి వెళ్లమని చెప్పటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎస్పీ చెప్పాడని నన్ను వెనక్కి నెడుతున్నారు.. ఎస్పీ ఏమైనా నా బాస్‌ అనుకుంటున్నారా అంటూ’ లాలూ పోలీసులతో ఘర్షణకు దిగారు. ఇప్పటికే లాలూను రాంచీకి తరలించడంపై ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. తేజస్వీ యాదవ్‌ కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిమ్స్‌ వైద్యులది తొందరపాటు నిర్ణయమని ఆయన విమర్శించారు.

ఇక్కడి నుంచి తరలించడం పెద్ద కుట్ర : లాలూ
ఇప్పటికే ఎయిమ్స్‌ వైద్యుల తీరును తప్పుబడుతూ.. తనకు హాని జరిగితే మీదే బాధ్యత అంటూ లాలూ లేఖాస్త్రం సంధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనను సోమవారం ఎయిమ్స్‌ నుంచి తరలించే సమయంలో మీడియాతో మాట్లాడారు. తనను రాంచీకి తరలించడం వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన పేర్కొన్నారు. నా ఆరోగ్యం క్షీణించటానికే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. పూర్తి స్థాయి వైద్య సౌకర్యాలు లేనిచోటుకి తరలిస్తున్నారని.. దీనిని ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు.

గడ్డి స్కాంలో ఇరుక్కుని జైలు పాలైన లాలూపై రైల్వే టెండర్ల  కేసులోనూ అవినీతి ఆరోపణలున్నాయి. అయితే జార్ఖండ్‌లోని బిర్సా ముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అనారోగ్యం కారణంగా లాలూను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.

చదవండి : తొందరపాటు నిర్ణయం.. తేజస్వీ ఆందోళన

మరిన్ని వార్తలు