ఐశ్వర్య రాయ్‌తో తేజూ పెళ్లి: వైరల్‌

6 Apr, 2018 10:08 IST|Sakshi
ఐశ్వర్య రాయ్‌, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌(పాత ఫొటోలు)

పట్నా : తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌- ఐశ్వర్య రాయ్‌ల పెళ్లి వార్త దేశమంతటా ఆసక్తి రేపుతున్నది. లక్షల మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ముహుర్తం ఖరారైంది. ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి దరోగా ప్రసాద్‌ రాయ్‌ మనుమరాలు, ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని ఐశ్వర్యా రాయ్‌తో తేజ్‌ ప్రతాప్‌ పెళ్లి ఫిక్స్‌ అయినట్లు యాదవ్‌ పరివారం వెల్లడించింది. ఏప్రిల్‌ 18న నిశ్చితార్థం, వచ్చే నెలలో పెళ్లి జరిపించేందుకు ఇరు కుటుంబాలూ అంగీకరించినట్లు సన్నిహితులు తెలిపారు. పట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్స్‌లో పెళ్లి వేడుకలు జరుగుతాయని సమాచారం.

ఐశ్వర్యదీ పెద్ద కుటుంబమే: లాలూ ఇంటి కోడలిగా రానున్న ఐశ్వర్యరాయ్‌దీ పెద్ద కుటుంబమే. ఆమె తాత దరోగా ప్రసాద్‌ రాయ్‌ బీహర్‌లో యాదవ సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తొలి వ్యక్తి. ఐశ్వర్య తండ్రి చంద్రికా రాయ్‌ బిహార్‌ మంత్రిగానూ పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించిన ఐశ్వర్యకు ఎన్నో సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించినప్పటికీ తిరస్కరించిందని ఆమె బంధువులు తెలిపారు. పెళ్లి ఖరారు కావడంతో లాలూ సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి ‘కోడళ్ల అన్వేషణ’ సగం ఫలించినట్లైంది. తేజ్‌ ప్రతాప్‌ సోదరుడు తేజస్వీ యాదవ్‌కు ఇప్పటికే 40వేల పెండ్లి ప్రపోజల్స్‌ వచ్చాయి. చిన్న కొడుకు పెళ్లి కూడా చేసేస్తే తన అన్వేషణ పూర్తవుతుందని రబ్రీ పలు మార్లు చమత్కరించిన సంగతి తెలిసిందే. గతంలో ‘పెద్దవాళ్లను గౌరవిస్తూ, ఇంటిని చక్కగా నడిపించే కోడలు దొరికితే చాలు’ అంటూ రబ్రీ దేవి  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. ‘సంస్కారమున్న కోడలు అంటే గృహిణిగా ఉండటమే కాదని.. ప్రేమ, ఆప్యాయతలు కురిపించి కుటుంబాన్ని తీర్చిదిద్దే లక్షణాలున్న గృహిణి అయినా, ఉద్యోగస్తురాలైనా కావచ్చు’ అంటూ లాలూ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు