మృత్యువుతో పోరాడుతున్న లాన్స్‌నాయక్

10 Feb, 2016 13:40 IST|Sakshi
మృత్యువుతో పోరాడుతున్న లాన్స్‌నాయక్

ఢిల్లీ: సియాచిన్‌ ప్రమాదం నుంచి బయటపడిన లాన్స్‌నాయక్ హనుమంతప్ప కొప్పాడ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ 24 గంటలు అత్యంత కీలకమని వైద్యులు వెల్లడించారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రి వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఢిల్లీలోని కర్ణాటక రెసిడెంట్ కమిషనర్ అతుల్ కుమార్ తివారి బుధవారం ఆర్మీ ఆస్పత్రిని సందర్శించారు. హనుమంతప్ప ఆరోగ్య పరిస్థతిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హనుమంతప్పకు ఐసీయూలో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారని తివారి తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. హనుమంతప్ప కుటుంబ సభ్యుల తరపున ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు ఆర్మీ ఆస్పత్రికి వచ్చినట్టు వెల్లడించారు. హనుమంతప్ప తమ రాష్ట్రానికి చెందినవాడు కావడం తమకెంతో గర్వకారణమని చెప్పారు. ఆయన కోలుకుంటాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

కర్ణాటకలోని థార్వాడ్‌కు చెందిన హనుమంతప్పకు భార్య, ఏడాదిన్నర పాప ఉన్నారు. భారత్-పాక్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద సియాచిన్ గ్లేసియర్‌పై ఉన్న సైనిక బేస్‌క్యాంపుపై ఆరు రోజుల కింద(ఫిబ్రవరి 3) మంచు చరియలు విరిగిపడడంతో 9 మంది సైనికులు మృతి చెందారు. 35 అడుగుల లోతులో కూరుకుపోయి ప్రాణాలతో ఉన్న హనుమంతప్పను సోమవారం వెలికితీశారు.

మరిన్ని వార్తలు