అహ్మద్‌ వనీకి ‘అశోక చక్ర’

25 Jan, 2019 05:36 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాదం బాటవీడి సైన్యంలో చేరి అమరుడైన లాన్స్‌నాయక్‌ నజీర్‌ అహ్మద్‌ వనీ(38)కి కేంద్రం అశోకచక్ర పురస్కారాన్ని ప్రకటించింది. 2018, నవంబర్‌ 25న షోపియాన్‌ జిల్లాలోని హీరాపూర్‌ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడ్డ అహ్మద్‌ వనీ ప్రాణాలు కోల్పోయారు. శరీరంలోకి బుల్లెట్లు దిగి రక్తం కారుతున్నప్పటికీ ఓ లష్కరే కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన తర్వాతే ఆయన నేలకొరిగారు.

ఈ నేపథ్యంలో వనీ చూపిన ధైర్యసాహసాలకు గానూ శాంతి సమయంలో అందించే అత్యున్నత సైనిక పురస్కారం అశోకచక్రను ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వనీ భార్య మహజబీన్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. 2004లో వనీ ఆర్మీలోని ‘జమ్మూకశ్మీర్‌ 162 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌’లో చేరారు. ఉగ్రవాదులపై పోరాటంలో చూపిన తెగువకు గానూ 2007, 2018లో సేనామెడల్‌ను అందుకున్నారు. కుల్గామ్‌ జిల్లాలోని ఛెకీ అష్ముజీ గ్రామానికి చెందిన వనీకి భార్య మహజబీన్‌తో పాటు కుమారులు అథర్, షహీద్‌ ఉన్నారు.

ఆయనకు డ్యూటీనే అత్యుత్తమం
నజీర్‌ వనీ కుటుంబాన్ని అమితంగా ప్రేమించేవారని ఆయన భార్య, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మహజబీన్‌ తెలిపారు. వనీ ధైర్యవంతుడైన సైనికుడనీ, తన రాష్ట్రంలో శాంతి కోసం పరితపించేవాడని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. జీవితాంతం వనీ పలు ప్రమాదాలను ఎదుర్కొన్నాడనీ, చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడని జవాన్లు అన్నారు.

మరిన్ని వార్తలు