భారత్‌పై భారీ దాడికి లష్కరే కుట్ర?

7 Nov, 2016 15:46 IST|Sakshi
భారత్‌పై భారీ దాడికి లష్కరే కుట్ర?
భారతదేశంపై భారీ స్థాయిలో దాడి చేయడానికి లష్కరే తాయిబా అధినేత హఫీజ్ సయీద్ కుట్ర పన్నుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రత అత్యంత పటిష్ఠంగా ఉండటంతో ఉగ్రవాదులు ఆ మార్గంలోంచి భారతదేశంలో ప్రవేశించడం సాధ్యం అయ్యే పరిస్థితి లేనందున.. జలమార్గం ద్వారానే దేశంలోకి ఉగ్రవాదులను పంపాలని లష్కర్ భావిస్తోంది. ప్రధానంగా నిక్కి, తావి, బడీతావి నదుల ద్వారా రావాలని లష్కరే ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ మొత్తం ఆపరేష్‌కు అబు ఇర్ఫాన్ తండేవాలాను ఇన్‌చార్జిగా సయీద్ నియమించాడంటున్నారు. అతడి సారథ్యంలో పెద్ద ఎత్తునే భారత్ మీద దాడి చేయాలని తలపెడుతున్నారు. 
 
ఈ ఆపరేషన్‌లో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఉగ్రవాదులు పాల్గొనే అవకాశం ఉంది. వాళ్లంతా మన దేశంలోకి ప్రవేశించడానికి పాకిస్థాన్ సైన్యం కూడా ఇతోధికంగా సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు నదీ మార్గంలో దేశంలోకి ప్రవేశించాలని చూస్తున్నట్లు సమాచారం అందడంతో.. నదులు, ప్రవాహాలు అన్ని ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల్లో కూడా బలగాలను పెంచారు. ఉగ్రవాదులు చొరబడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ బలగాలు అదనపు దళాలను మోహరించాయి. ఈసారి భారీస్థాయిలో అంతర్జాతీయ సరహిద్దుల ద్వారా లోనికి చొరబడే ప్రయత్నాలు జరిగినట్లు బీఎస్ఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 29 నాటి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత దాదాపు 15 సార్లు చొరబాటు యత్నాలను బీఎస్ఎఫ్ తిప్పికొట్టింది. ఇవన్నీ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నదులు లేదా అడవుల ద్వారానే జరిగాయి. భారత్-పాక్ సరిహద్దుల్లో మూడు నదులు, 11 ప్రవాహాలు ఉన్నాయి. 
మరిన్ని వార్తలు