ఆ ఆలయాన్ని పేల్చేస్తాం : లష్కరే

21 Oct, 2018 12:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల్లో భీకర దాడులతో అలజడి సృష్టిస్తామని పాక్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హెచ్చరించింది. అక్టోబర్‌ 20, నవంబర్‌ 9 తేదీల్లో భీకర దాడులు చేపడతామని లష్కర్‌ ఏరియా కమాండర్‌ మౌల్వి అబు షేక్‌ రావల్పిండి నుంచి హెచ్చరిక లేఖ రాసినట్టు హిందుస్థాన్‌ టైమ్స్‌ పేర్కొంది.

అక్టోబర్‌ 20న ఎలాంటి విధ్వంసం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నా నవంబర్‌ 9న ఎలాంటి అలజడి రేగుతుందనే ఆందోళనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని పేల్చివేస్తామని సైతం లష్కరే హెచ్చరించడంతో నిఘా, భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి.

మరోవైపు ఉగ్ర సంస్థ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్లను టార్గెట్‌ చేసిందనే అనుమానంతో భోపాల్‌, గ్వాలియర్‌, కట్ని, జబల్‌పూర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు. డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్ధాన్‌, మధ్యప్రదేశ్‌లకు లష్కరే దాడుల హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. 2008 నవంబర్‌ 26న ముంబై పేలుళ్లలో 166 మంది మరణించడం, 300 మందికి పైగా గాయపడిన దారుణ ఘటనను లష్కరే ఉగ్రవాద సంస్థ చేపట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు