పద్మ అవార్డుల కోసం ఎవరి పేర్లయినా..

11 Sep, 2017 19:13 IST|Sakshi
పద్మ అవార్డుల కోసం ఎవరి పేర్లయినా..
న్యూఢిల్లీ: 
వివిధ రంగాల్లో విశిష్ట  సేవలందించిన వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పద్మ అవార్డుల నామినేషన్‌ ప్రక్రియ శుక్రవారం(సెప్టెంబర్‌ 15)తో ముగియనుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం తదితర రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. 2018 ఏడాదికి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ కేంద్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. పద్మ అవార్డుల నామినేషన్లు స్వీకరించడానికి చివరితేదీని సెప్టెంబర్‌ 15గా(అర్ధరాత్రి వరకు) నిర్ణయించారు. ప్రజల్లో ఎవరైనా పద్మ అవార్డుల కోసం ఎవరి పేర్లయినా ప్రతిపాదించవచ్చు.
 
 
దీనివల్ల వెలుగులోకి రాని చాలామంది అర్హులైన వ్యక్తులకు సరైన గుర్తింపు లభించే అవకాశం ఉంది. ప్రజలందరూ తమ ప్రతిపాదనలను అధికారిక వెబ్‌సైబ్‌ www.padmaawards.gov.in ద్వారా పంపొచ్చు. కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే ప్రతిపాదనలను స్వీకరించనున్నారు. సామాన్యులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు, సీఎంలు, గవర్నర్లు, మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారత రత్న, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీతలు కూడా పద్మ అవార్డు కోసం వ్యక్తుల పేర్లను ఆన్‌లైన్‌ ద్వారానే ప్రతిపాదించే అవకాశాన్ని కల్పించారు. ప్రధాని మోదీ నియమించిన పద్మ అవార్డుల కమిటీ అవార్డుల ప్రదానంపై తుది నిర్ణయం తీసుకుంటుంది. గతంలో రాజకీయ నేతలు, మంత్రులు సిఫార్సు చేసినవారికే పద్మ అవార్డులు అందేవి. అవార్డు గ్రహీతల ఎంపిక పారదర్శకంగా జరగడానికి నామినేషన్‌ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ చేశారు.
మరిన్ని వార్తలు