ఆరో దశ పోలింగ్‌ : నేటితో ముగియనున్న ప్రచారం

10 May, 2019 10:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో విస్తరించిన 59 స్ధానాలకు ఆదివారం జరగనున్న ఆరోవిడత పోలింగ్‌కు ప్రచారం నేటితో ముగియనుంది. బిహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, యూపీ, పశ్చమ బెంగాల్‌, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ దశలో పోలింగ్‌ జరగనుంది. సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకోవడంతో ఆయా పార్టీల అగ్రనేతలు పోలింగ్‌ జరిగే రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాలు విరామం లేకుండా వరుస ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచారం ముగియనుండటంతో శుక్రవారం ప్రధాని మూడు రాష్ట్రాల్లో ర్యాలీల్లో పాల్గొననున్నారు. హర్యానాలోని రోహ్తక్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో మండి, పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో ర్యాలీలేను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

ఇక కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉనా, పంజాబ్‌ రాజధాని చండీగఢ్‌లో ర్యాలీల్లో పాల్గొంటారు. బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా హర్యానాలో హిసార్‌, చర్కి దాద్రిలో రెండు బహిరంగసభల్లో పాల్గొంటారు. ఇక కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేడు యూపీలోని సిద్ధార్ధ్‌నగర్‌, బస్తి, సంత్‌కబీర్‌ నగర్‌, బదోహిల్లో నాలుగు బహిరంగసభల్లో ప్రసంగించనున్నారు.

మరిన్ని వార్తలు