రేపు రాత్రి 8 గంటలకు చివరి మెట్రో రైలు

22 Oct, 2014 04:08 IST|Sakshi
రేపు రాత్రి 8 గంటలకు చివరి మెట్రో రైలు

 సాక్షి, న్యూఢిల్లీ: దీపావళిని పురస్కరించుకుని గురువారం ఆఖరి మెట్రో రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని ఢిల్లీ మెట్రో మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.  ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ లైన్‌కు కూడా ఈ వేళలు వర్తిస్తాయి. దిల్షాద్ గార్డెన్, రిఠాలా, జహంగీర్‌పురి, హుడా సిటీ సెంటర్, నోయిడా సిటీ సెంటర్, ద్వారకా సెక్టర్ 21, వైశాలి, కీర్తినగర్, ఇందర్‌లోక్, ముండ్కా, సెంట్రల్ సెక్రటేరియట్, బదర్‌పుర్, న్యూఢిల్లీ నుంచి ఆఖరి మెట్రో రైలు  రాత్రి 8 గంటలకు బయలుదేరుతుంది. గురువారం ఉదయం మెట్రో సేవలు మామూలు సమయానికే ఉదయం 6 గంటలకు మొదలవుతాయి. ఎయిర్‌పోర్టు మెట్రో ఉదయం 4.45 గంటలకు  బయలుదేరుతుంది. భాయ్ దూజ్ రోజున( అక్టోబర్ 25న) ప్రయాణికుల ర ద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు మెట్రో రైళ్లను స్టాండ్‌బైగా ఉంచాలని నిర్ణయించారు. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నట్లయితే స్టాండ్‌బైగా ఉంచిన రైళ్లను నడుపుతారు. మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, గైడ్లు అందుబాటులో ఉంటారు. మెట్రో సేవలు యథావిధిగా ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి.. ఎయిర్‌పోర్టు మెట్రో కూడా ఉదయం 4.45 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు నడుస్తుంది.
 

మరిన్ని వార్తలు