జమిలికి లా కమిషన్‌ జై..

15 Aug, 2018 09:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశమంతటా ఏకకాల ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు లా కమిషన్‌ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. ఆగస్ట్‌ 31లోగా కమిషన్‌ సమర్పించే తుది నివేదికలో జమిలి ఎన్నికలకు అనుకూలంగా కీలక సిఫార్సులు ఉంటాయని భావిస్తున్నారు. జమిలిపై పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను కమిషన్‌ కూలంకషంగా చర్చించిన లా కమిషన్‌ దీని అమలుకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. రెండు దశల్లో రాష్ట్ర అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదిస్తోంది.

మరోవైపు అవిశ్వాస తీర్మానం సందర్భంగా సానుకూల ఓటును కూడా పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వీగిపోయిన ప్రభుత్వం స్ధానంలో కొత్త సర్కార్‌ కొలువయ్యే జర్మనీ మోడల్‌ను కూడా లా కమిషన్‌ అథ్యయనం​చేసిందని అధికారులు చెబుతున్నారు.

జమిలి ఎన్నికల కోసం ఫిరాయింపు నిరోధక చట్టంలోనూ సవరణలు అవసరమని, పార్లమెంటరీ పద్ధతులు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ కొన్ని సవరణలు చేపట్టాల్సి ఉంటుందని, వీటికి సంబంధించిన వివరాలను కూడా తుది నివేదికలో లా కమిషన్‌ పొందుపరచనుందని కమిషన్‌ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు తుది నివేదిక ముసాయిదాను లా కమిషన్‌ పది రోజుల ముందు సభ్యులందరికీ అందించి వారి ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా నివేదికకు తుదిమెరుగులు దిద్దనుంది.

మరిన్ని వార్తలు