మహిళా జడ్జీకి లాయర్ల బెదిరింపు

30 Nov, 2019 03:57 IST|Sakshi

తిరువనంతపురం: కొందరు లాయర్లు తనను బెదిరించారంటూ ఓ మహిళా జడ్జీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 12 మందిపై పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఓ నిందితుడి బెయిల్‌ రద్దు విషయమై మాట్లాడేందుకు తన చాంబర్‌కు వచ్చిన లాయర్లు చట్టవిరుద్ధంగా ప్రవర్తించారంటూ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ దీపా మోహన్‌ లిఖిత పూర్వకంగా చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదును పోలీసులకు పంపారు.

దీనిపై స్పందించిన పోలీసులు తిరువనంతపురం బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌తోపాటు 12 మందిపై దాడి, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడం వంటి నేరాల కింద పలు కేసులు పెట్టారు. ‘ఒక నిందితుడి బెయిల్‌ రద్దు, రిమాండ్‌పై చర్చించేందుకు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కేపీ జయచంద్రన్‌ మరికొందరితో కలిసి నా బాంబర్‌కు వచ్చారు. సదరు నిందితుడి రిమాండ్‌ ఉత్తర్వులు రద్దు చేస్తారా లేదా అంటూ బెదిరించారు.  మహిళ కాకపోయుంటే మిమ్మల్ని కొట్టి ఉండేవాళ్లం. బయటికి వస్తే అంతుచూస్తామంటూ జయచంద్రన్‌ వెళ్లిపోయారు’అని బాధిత జడ్జీ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర జ్యుడీషియల్‌ అధికారుల సంఘం కేరళ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. కాగా, మహిళా జడ్జీ ఆరోపణలన్నీ అబద్ధాలేనంటూ తిరువనంతపురం బార్‌ అసోసియేషన్‌ శుక్రవారం విధులు బహిష్కరించింది.

మరిన్ని వార్తలు