వచ్చారు.. వెళ్లారు.. ఏమీ చేయలేదు

15 Dec, 2015 09:40 IST|Sakshi
వచ్చారు.. వెళ్లారు.. ఏమీ చేయలేదు

రైల్వే టెర్మినల్ ఏర్పాటు కోసం దక్షిణ ఢిల్లీలో కూల్చివేసిన షాకూర్ బస్తీ వాసులను పరామర్శించేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఒకరితో ఒకరు పోటీపడి మరీ వెళ్లారు. ప్రభుత్వ పరిధిలోని రైల్వేశాఖ కూల్చివేస్తే.. స్పందించాల్సందిపోయి ఆప్ నేతలు ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించి రాహుల్ గాంధీ తప్పులో కాలేశారు కూడా. అయితే ఎవరికి వాళ్లు ఇలా రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప అక్కడి బస్తీ వాసులకు చేసింది ఏమీ లేదు. రాత్రంతా చలిలోనే మగ్గిపోయామని, తమకు పునరావాసం కల్పించలేదని.. కనీసం వచ్చిన నాయకుల్లో ఏ ఒక్కరూ రగ్గులు కూడా పంచలేదని బస్తీ వాసులు వాపోతున్నారు.

అంతటి చలి మధ్యే, కూలిపోయిన శిథిలాల నడుమ ఓ నిండు గర్భిణి ఆదివారం రాత్రి సమయంలో ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పసిగుడ్డు కూడా చలికి వణికిపోయిందని స్థానికులు చెబుతున్నారు. చివరకు అక్కడున్న చితుకులను మంట వేసుకుని, వాటితో చలి కాగాల్సి వచ్చింది. తమకు తాగడానికి మంచినీళ్లు, తినడానికి తిండి కూడా లేవని, నాయకులు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయడానికి బదులు తమకు కాసింత తిండి, నీళ్లు ఇచ్చి ఆదుకోవాలని షాకూర్ బస్తీ వాసులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు