విదేశాలకు మొబైల్ ఫోన్ డేటా లీకేజి వాస్తవమే

5 Jan, 2018 16:50 IST|Sakshi

న్యూఢిల్లీ : విదేశాలకు మొబైల్‌ ఫోన్‌ డేటా లీకేజీ వాస్తవమేనని రాజ్యసభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు  కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా సమాధానమిచ్చారు. అయితే లీకవుతున్న సమాచారం ఎలాంటిదో కనిపెట్టడం కష్టమని మనోజ్ సిన్హా శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ..మొబైల్ ఫోన్ల ద్వారా విదేశాలకు సమాచారం లీక్ అవుతున్నట్లుగా కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలు ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

ఈ వార్తలపై వెంటనే స్పందించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ రంగంలోకి దిగిందన్నారు. మొబైల్ ఫోన్ల భద్రత, రక్షణ కోసం ఫోన్ల తయారీ సంస్థలు ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయి..ఆయా ఫోన్ల ఆర్కిటెక్చర్, ఫ్రేమ్‌ వర్కు తదితర వివరాలను సమర్పించాలని మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలను కోరినట్లు మంత్రి తెలిపారు. మొబైల్ డేటా విదేశాలకు లీకవుతున్నట్లు వార్తలు వెలువడిన తర్వాత తమ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాండర్డైజేషన్ టెస్టింగ్, క్వాలిటీ సర్టిఫికేషన్ విభాగం దీనిపై లోతుగా  పరిశీలన జరిపిందని చెప్పారు.

మొబైల్ ఫోన్ల నుంచి షేర్ అవుతున్న డేటా సంకేత సంక్షిప్త సందేశం (ఎన్క్రిప్ట్) రూపంలో ఉంటున్నందున అది ఎలాంటి సమాచారమో కనిపెట్టడం కష్టమవుతోందని మంత్రి చెప్పారు. ఈ డేటా కేవలం తమ ప్రతిభా సామర్థ్యాలను మరింతగా పెంపొందిచుకోవడం కోసం మాత్రమే వినియోగిస్తున్నట్లుగా ఆయా కంపెనీలు చెబుతున్నాయని మంత్రి వివరించారు.

మరిన్ని వార్తలు